
పాలస్తీనాకు మద్దతిస్తే ఉగ్రవాదానికి మద్దతిచ్చినట్లే
ఒత్తిడికి పశ్చిమదేశాలు తలొగ్గినా ఇజ్రాయెల్ మాత్రం తగ్గదు
ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఇజ్రాయెల్ ప్రధాని
నెతన్యాహూ ప్రసంగాన్ని బహిష్కరించిన పలు దేశాలు
ఆయన ప్రసంగం సమయంలో అనుకూల, వ్యతిరేక నినాదాలు
ఐక్యరాజ్య సమితి: గాజాలో హమాస్‌కు వ్యతిరేకంగా తాము చేపట్టిన యుద్ధం మధ్యలో ఆపే ప్రసక్తే లేదని, పని పూర్తిచేసి తీరుతామని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ స్పష్టంచేశారు. గాజా యుద్ధం, పాలస్తీనా విషయంలో అంతర్జాతీయ ఒత్తిళ్లకు పశ్చిమదేశాలు తలొగ్గవచ్చేమో కానీ.. ఇజ్రాయెల్ మాత్రం వెనక్కు తగ్గదని తేల్చి చెప్పారు. ఐరాస సర్వప్రతినిధి సభను ఉద్దేశించి శుక్రవారం ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కొన్ని దేశాలు నెతన్యాహూ ప్రసంగాన్ని బహిష్కరించాయి. కొన్ని దేశాల ప్రతినిధులు సభలోనే ఉండి నెతన్యాహూ ప్రసంగిస్తున్నప్పుడు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రతిగా మరికొన్ని దేశాల ప్రతినిధులు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. ఆమెరికా మాత్రం ఎప్పటిలాగే ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచింది. చాలావరకు ముఖ్య దేశాలన్నీ ఈ సమావేశానికి జూనియర్ అధికారులను పంపి తమ నిరసనను తెలిపాయి.
గాజాపై దాడులను ఆపాలని అంతర్జాతీయంగా ఎంతగా ఒత్తిళ్లు వస్తున్నా.. నెతన్యాహూ పట్టించుకోకపోవటంతో ఇటీవలే ఆస్ట్రేలియా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. క్రమంగా అంతర్జాతీయంగా ఒంటరిగా మారుతున్నా నెతన్యాహూ వెనక్కి తగ్గేదే లేదు అని ప్రకటించారు. పాలస్తీనాను గుర్తించిన దేశాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘పశ్చిమదేశాల నేతలు ఒత్తిళ్లకు తలొగ్గవచ్చు.
కానీ, మీకు నేను ఒక హామీ ఇస్తున్నా.. ఇజ్రాయెల్ ఎప్పటికీ తలొగ్గదు. మీ అవమానకరమైన నిర్ణయం (పాలస్తీనాను దేశంగా గుర్తించటం) యూదులు, అమాయక పౌరులకు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. యూదు వ్యతిరేక భావజాలం ఎప్పటికీ అంతమవదేమో.. కానీ, అది దారుణంగా చావాలి’అని పేర్కొన్నారు. ప్రసంగం సందర్భంగా నెతన్యాహూ, ఆయన బృందం ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిచేసి పౌరులను బందీలుగా తీసుకెళ్లిన ఘటనను చూపించే క్యూఆర్ కోడ్‌ను ధరించారు. ‘ది కర్స్’పేరుతో రూపొందించిన ఓ మ్యాప్‌ను కూడా ప్రదర్శించారు.