ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకుంటే అంతేనట!

Covid vaccine can turn people into crocodiles Bolsonaro - Sakshi

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే మొసళ్లలా మారిపోవచ్చు

ఆడవారికి గడ్డం మొలవచ్చు

సూపర్ హూమన్‌గా మారిపోతారు

కరోనావైరస్‌కు సంబంధించి సంచలన వ్యాఖ్యలతో మొదటినుంచీ వార్తల్లో వ్యక్తిగా  నిలుస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్‌ బోల్సనారో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోవిడ్‌-19 వ్యాక్సిన్ తీసుకుంటే మనుషులు మొసళ్లలా మారిపోవచ్చంటూ  సరికొత్త వివాదానికి తెర తీసారు. అంతేకాదు ఆడవాళ్లకు గడ్డం మొలిచే అవకాశాలున్నాయంటూ కోవిడ్ వ్యాక్సిన్‌పై సంచలన కామెంట్స్ చేశారు.  అమెరికా ఆమోదం తెలిపిన  ఫైజర్‌  టీకాపై ఆయన  తాజా వ్యాఖ్యలు చేశారు. (టీకా భద్రత : బైడైన్‌ దంపతుల ​ముందడుగు)

 ఒకవైపు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌‌కు అంతానికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు పలు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.  మరోవైపు  బోల్సనారో  వ్యాఖ‍్యలు  వివాదాస్పదమౌతున్నాయి. కోవిడ్ టీకా కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఆయన ఫైజర్‌ టీకా తయారీ కంపెనీలపై తన దాడిని ఎక్కుపెట్టారు. ఈ టీకా తీసుకుంటే మనుషులు మొసళ్లలా మారే అవకాశాలున్నాయన్నారు. అయితే ఇలాంటి దుష్ప్రభావాలకు తాము బాధ్యత వహించమనీ,  మీరు (ప్రజలు) మొసళ్లుగా మారితే,  అది మీ సమస్య అని  పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తరువాత సూపర్ హూమన్‌గా మారినా, మహిళలకు గడ్డం మొలిచినా,  పురుషులు వేరేవిధంగా మాట్లాడినా  ఔషధ తయారీదారులకు ఎలాంటి సంబంధం ఉండదంటూ వారిపై దాడిచేశారు. టీకా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది కానీ తాను మాత్రం కరోనా టీకా వేసుకొనేది లేదని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే తనకు కరోనా సోకిన కారణంగా ఇప్పటికే తన శరీరంలో యాంటిబాడీస్‌ ఉన్నాయి.. ఇక తానెందుకు టీకా తీసుకోవాలంటూ ప్రశ్నించారు. అలాగే టీకాను తాము ఉచితంగా ఇవ్వబోతున్నామని, అలాగని టీకా తప్పనిసరి కాదన్నారు. టీకా తీసుకోని వారికి జరిమానాలు విధించబోమని, ఒత్తిడి చేసే ప్రసక్తే  ఉండదని బోల్సనారో స్పష్టం చేశారు. (వ్యాక్సిన్‌ షాట్‌: కుప్పకూలిన నర్సు : వీడియో వైరల్‌)

కాగా బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 7.1 మిలియన్లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లక్షా 85 వేల మంది మృతి చెందారు. గతంలో కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌పై విభిన్నంగా స్పందించిన బ్రిజిల్‌ అధ్యక్షుడు కరోనా సాధారణ ఫ్లూమాత్రమేనంటూ వ్యాఖ్యానించారు. మాస్క్‌ ధరించేందుకు నిరాకరించి వివాదంలో నిలిచారు. ఆ తరువాత ఆయన కూడా  కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top