విజయవాడ: ఏపీలో క్రమేపీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురికి కోవిడ్-19 సోకగా, తాజాగా మరో కేసు నమోదైంది. విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో కరోనా కేసు నమోదైంది. 13 ఏళ్ల బాలికకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జ్వరంతో ఆసుపత్రికి వచ్చిన తిరువూరుకు చెందిన బాలికకు టెస్టులు చేయగా కోవిడ్‌గా తేలింది. ఆర్టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో ఆ బాలికను కోవిడ్ వార్డుకు తరలించారు వైద్యులు.
తాజా కేసులో ఏపీలో కోవిడ్ కేసుల సంఖ్య 16కు చేరింది. రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గుర్తించారు. పూణే ల్యాబ్ లో 4 శాంపిల్స్‌కు జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా తేలింది. గొంతు నొప్పి,దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, అలసట, ఒళ్లు నొప్పులు వంటివి ఒమిక్రాన్ RF.5 లక్షణాలు.
కాగా, దేశంలో మళ్లీ కోవిడ్ వ్యాప్తి వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా 340కిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలో జూన్ 26 నుంచి శుక్రవారం వరకు నలుగురు కోవిడ్‌తో మృతిచెందారు..


