కోపైలట్‌లో అతి ఇస్లామిక్ భావజాలం
కోపైలట్ ఖాతాలో అల్‌ఖైదీ ఉగ్రనేతలు అల్ జవహరి, ఖలీల్ అబూల ఫొటోలు
కోపైలట్‌ను హమామ్ అల్–హమామీగా గుర్తింపు
గతంలోనూ అతివాద మనస్తత్వంతో పైలట్ విధుల నుంచి తొలగింపు
తల్లి సిరియన్.. తండ్రి ఒమని
న్యూయార్క్: విమానాన్ని నిట్టనిలువుగా కూల్చేసి వందల మంది ప్రాణాలను గాల్లో కలిపేసేందుకు ప్రయత్నించిన ఫ్లైదుబాయ్ కోపైలట్‌ను హమామ్ అల్–హమామీగా గుర్తించారు. ఇతని మనస్తత్వం మొత్తం అతివాద భావజాలంతో నిండిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఇతని గత చరిత్ర, సోషల్‌మీడియా ఖాతాల్లో కార్యకలాపాల వివరాలను అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది.
ఆకర్షితుడైన హమామీ అతి ఇస్లామిక్ భావజాలానికి ఆకర్షితుడైనట్లు వెల్లడైంది. అంతర్జాతీయ ఉగ్రవాది, అల్‌ఖైదా నేత అల్ జవహరితోపాటు హుమామ్ ఖలీల్ అబూ ములాల్ అల్–బాలావీలను హమామీ ఆరాధించినట్లు తేలింది.
గతంలో మొరాకో జాతీయ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసినప్పుడు తోటి మహిళా సిబ్బందికి కనీసం షేక్‌హ్యాండ్ కూడా ఇచ్చేవాడు కాదని, పెళ్లయితే భార్య ఉద్యోగం మానేయాల్సిందేనని షరతు విధించాడని తెలిసింది. అతి ఛాందసవాదం, విధుల్లో అతి మనస్తత్వంతో గతంలో ఒమన్ ఎయిర్ సంస్థలో పైలట్ శిక్షణ నుంచి ఉద్వాసనకు గురయ్యాడని వెల్లడైంది.
అసలు ఎవరీ హమామీ?
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పుట్టిన హమామీ ఎక్కువకాలం అక్కడే గడిపాడు. హమామీ తల్లి సిరియా దేశస్తురాలుకాగా తండ్రి ఒమన్‌వాసి. దీంతో హమామీకి ఒమన్ పౌరసత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లైదుబాయ్ సంస్థలో ఇతను 8 నెలల క్రితమే చేరాడు. అంతకుముందు ఒమన్ ప్రభుత్వ ఒమన్ ఎయిర్‌లో ఏడేళ్లు పనిచేశాడు.
అక్కడ అతని అతివాద మనస్తత్వం చూసిన సంస్థ వెంటనే పైలట్ శిక్షణ నుంచి తప్పించింది. సంస్థలో కేవలం ఆఫీస్ పనులకు పరిమితంచేసింది. ఆ ఉద్యోగం నచ్చక 2025 ఫిబ్రవరిలో అక్కడ పని మానేశాడు. తర్వాత మొరాకో జాతీయ ఎయిర్‌లైన్స్ అయిన ‘రాయల్ ఎయిర్ మరోక్’లో 2025 జూన్‌లో చేరాడు. ఇక్కడ ఉన్నప్పుడు తరచూ అతివాద వీడియోలు, ప్రసంగాలు ఉన్న ‘ర్యాడికల్’వెబ్‌సైట్లను తరచూ చూసేవాడు.
తర్వాత అక్కడా మానేసి ఫ్లైదుబాయ్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో చేరాడు. అతిగా ప్రార్థనలు చేసేవాడు. మత సంబంధ అత్యంత కఠిన నియమాలను పాటించేవాడు. తోటి మహిళా ఉద్యోగులతో సరిగా మాట్లాడేవాడు కాదు. కనీసం వాళ్లకు షేక్‌హ్యాండ్ కూడా ఇచ్చేవాడు కాదు అని తోటి ఉద్యోగులు వెల్లడించారు. 2023లో బ్రిటన్‌లోని బకింగ్‌హామ్‌షైర్ న్యూ యూనివర్సిటీలో దూరవిద్యలో మూడేళ్ల ఏవియేషన్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తిచేశాడు.
లింక్డి్డన్‌లో ఉగ్రవాదుల ఫొటోలు
అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌తో కలిసి అమెరికాపై విమానాలతో దాడికి పథక రచన చేసిన ఉగ్రనేత అల్ జవహరి ఫొటోను హమామీ తన లింక్డి్డన్ ఖాతాలో పోస్ట్‌చేశాడు. అమెరికా సీఐఏ అధికారులు సహా 9 మందిని చంపేసిన 2009నాటి ఆత్మాహుతి దాడికి వ్యూహం పన్నిన అల్‌ఖైదా ఉగ్రవాది హుమామ్ ఖలీల్ అబూ ములాల్ అల్–బాలావీ ఫొటోను సైతం హమామీ పోస్ట్‌చేశాడు. ముస్లింల మూడు అతి పవిత్ర ప్రదేశాలు మక్కా, మదీనా, జెరూసలేం కృత్రిమ మేధ ఫొటోలనూ పోస్ట్‌చేశాడు.
పైలట్ అనగానే పెళ్లికి రెడీ అయ్యారు..
2021 నుంచి 2022 వరకు ‘ఎక్స్’ఖాతాలో హమామీ పెట్టిన పోస్ట్‌లను అంతర్జాతీయ మీడియా ప్రధానంగా ప్రస్తావించింది. పెళ్లి చేసుకోవాలంటే కాబోయే భార్య ఎల్లప్పుడూ ముఖం కన్పించకుండా నిఖాబ్ ధరించాలని హమామీ షరతు పెట్టాడు. పెళ్లికి ముందు ఆమె ఉద్యోగం చేస్తే పెళ్లయ్యాక మానేయాల్సిందేనని మరో షరతు పెట్టాడు.
ఇలాంటి పలు షరతులతో ఎంతో మంది తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించానని తల్లి బాధపడిందని ఒక పోస్ట్‌పెట్టాడు. అయితే తన కుమారుడు పైలట్ అని చెప్పగానే చాలా మంది పెళ్లికి సుముఖత వ్యక్తంచేశారని తల్లి చెప్పిందని మరో పోస్ట్‌పెట్టాడు. ‘‘అమ్మాయిలు ఉద్యోగం చేస్తే పని ప్రదేశాల్లో చెడు వాతావరణం కారణంగా పాడైపోతారు’’అని మరో పోస్ట్ పెట్టాడు.
‘‘సంస్కారవంతులైన, మతాచారాలు పాటించే మహిళలు పనిప్రదేశాల్లో పురుషులతో కలిసి పనిచేయడంతో చెడిపోకుండా ఉంటారా? అలా ఎంత మంది మహిళల మనసులు మారిపోయి ఉంటాయి?’’అని 2022 ఫిబ్రవరిలో ఒక పోస్ట్‌లో ప్రశ్నించాడు. అయితే గతంలోనే అతిభావజాలంతో పైలట్ ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి తర్వాత వేరే ఎయిర్‌లైన్స్‌లో అదే పైలట్ ఉద్యోగం ఎలా సంపాదించాడు? అనే దానిపై దర్యాప్తు అధికారులు ఆరాతీస్తున్నారు. ఫ్లైదుబాయ్ సంస్థ ఈ పైలట్ గత చరిత్రపై ఏమాత్రం ఆరాతీయలేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
క్రాష్ గొడ్డలితోనే దాడి
స్మిత్ మచ్ఛార్‌పై కోపైలట్ దాడికి ఉపయోగించిన ఆయుధం ‘క్రాష్ గొడ్డలి’అని దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. గొడ్డలితో దాడిచేసి కెపె్టన్‌ను గాయపరిచి విమానాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని కోపైలట్ ప్రయత్నించాడని, ఇది ముమ్మాటికీ ఉగ్రచర్యేనని యూఏఈ శనివారం ప్రకటించింది.
మార్గమధ్యంలో అత్యవసర సమయాల్లో విమాన తలుపులు మూసుకుపోతే ఎమర్జెన్సీ మార్గాలను ఏర్పాటుచేసేందుకు అవసరమైతే కిటికీలు బద్దలుకొట్టేందుకు ఉపయోగించేలా క్రాష్ గొడ్డలిని కాక్‌పిట్‌లో విమానంతయారీ సమయంలోనే భద్రపరుస్తారు.
దీనిని తీసుకుని మచ్ఛార్ మీదకు హమామీ విచక్షణారహితంగా దాడిచేసినట్లు యుఏఈ అటార్నీ జనరల్ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. అమెరికాలో సెపె్టంబర్ 11 దాడులకు ముందు వరకు దాదాపు అన్ని విమానాల్లో ఈ గొడ్డలిని ప్యాసింజర్ క్యాబిన్‌లో ఉంచేవారు. 9/11 ఘటన తర్వాత ప్రయాణికులకు ఇది అందుబాటులో ఉంటే ప్రమాదం అని భావించి కాక్‌పిట్/ఫ్లైట్ డెస్క్‌లోకి మార్చారు.


