కోడలిపై మామ అరాచకం.. పొట్టి షార్ట్‌ వేసుకుందని వేడి వేడి సూప్‌ పోసి..

Chinese Man Throws Hot Soup On Daughter in Law Over Too Short pant - Sakshi

ఆధునిక కాలంలో అనేక మార్పులు వచ్చాయి. అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు. అయినా కొంతమంది ప్రజల ఆలోచన విధానాల్లో మార్పు రావడం లేదు. టెక్నాలజీ అభివృద్ధి చెందుత్ను ఇంకా పితృస్వామ్య మూస ధోరణిలోనే జీవిస్తున్నారు. మా మాటే వినాలి, మేము చెప్పిందే చేయాలనే విధంగా స్త్రీలపై అధిపత్యం చెలాయిస్తున్నారు.  చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లో అలాంటి ఓ సంఘటనే తాజాగా వెలుగు చూసింది.

స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తన కోడలిని వేధింపులకు గురిచేశాడు. పొట్టి బట్టలు వేసుకుందని ఆమెపై వేడి వేడి సూప్‌ పోసి దాడి చేశాడు. ఈ ఘటన జూన్‌ 12 న జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. కోడలు సరైన బట్టలు వేసుకోలేదని మామ ఆమెపై అరిచాడు. ఆమె ధరించిన హాట్‌ ప్యాంట్‌( పొట్టి షార్ట్‌) చాలా చిన్నగా ఉందని తిట్టాడు. ఇలాగే బయటకు వెళ్తే ఇరుగు పొరుగు వారు చూస్తే తమ పరువు పోతుందని అన్నాడు. 

దీనిపై కోడలు స్పందిస్తూ.. ‘నా డబ్బులతో నేను దుస్తులు కొనుకున్నాను. నాకు నచ్చినట్లు వేసుకుంటాను’ అని సమాధానం చెప్పింది. ఈ మాటలు విన్న ఆమె మామయ్య ఒక్కసారిగా హింసాత్మకంగా మారాడు. కోడలు ముఖంపై వేడి సూప్ గిన్నెను విసిరాడు. అంతటితో ఆగకుండా ఈ గొడవను పెద్దది చేస్తూ ఆమె జుట్టు పట్టుకొని లాగి ‘ నేను నిన్ను ఈరోజు చంపేస్తాను’ అంటూ బెదిరించాడు.

ఇంతలో అక్కడికి వచ్చిన మహిళ కొడుకు.. తల్లిని రక్షించేందుకు ఆమెను బెడ్‌రూంలోకి తీసుకెళ్లి తాళం వేశాడు. ఈ విషయం పోలీసుల వరకు చేరుకుంది. వారు ఇంటికి చేరుకొని మహిళ దుస్తుల వల్ల ఎవరికి ఏ నష్టం లేదని దుస్తుల పేరుతో ఆమెను వేధించడం మానేయాలని మామను హెచ్చరించారు. అయితే ఈ విషయం అక్కడితో ఆగలేదు. మామ వేధింపుల గురించి భర్తకు తెలియజేయగా అతను సైతం తండ్రి వైపే నిలిచాడు. అలాంటి దుస్తులు ధరించవద్దని భార్యను వారించాడు. తనకు అండగా ఉంటాడనున్న భర్త సైతం తండ్రి వైఖరితోనే ఉండటంతో తాను విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సదరు మహిళ తెలిపింది.

ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో ఆమె ముఖంపై గాయాలు, మచ్చలు ఉన్నాయి. వీటిని చూస్తుంటే మామ ఆమెను తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో నెటిజన్లు మామ ప్రవర్తనపై మండిపడుతున్నారు. ‘ఆమెను చంపేస్తానని బెదిరించడానికి అతనికి ఎంత ధైర్యం? చాలా భయంకరంగా ఉంది ఇది. మనం ఇంకా రాజుల కాలంలో జీవించడం లేదు. ఆమె ఆ దుస్తులు ఎందుకు ధరించవద్దంటూ ప్రశ్నిస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top