
బీజింగ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి భారత్, చైనాలే నిధులు సమకూరుస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై డ్రాగన్ దేశం చైనా విరుచుకుపడింది. తాము రష్యాతో జరుపుతున్న వాణిజ్యంపై అమెరికా జోక్యం చేసుకుని ఎలాంటి చర్యలైనా చేపడితే దానికి దీటుగా బదులిస్తామని చైనా స్పష్టంచేసింది.
చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గుయో జియాకున్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. యూరోపియన్ యూనియన్‌తో పాటు సాక్షాత్తు అమెరికానే రష్యాతో వాణిజ్యం నెరుపుతున్నాయని చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించి శాంతిని నెలకొల్పేందుకు చైనా చర్చలను చురుకుగా ప్రోత్సహిస్తోందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. చైనా, భారత్ దేశాలు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశానికి ఆర్థిక బలాన్నిస్తున్నాయని ట్రంప్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
‘అమెరికా, ఈయూ దేశాలతోపాటు ప్రపంచంలోని చాలా దేశాలు రష్యాతో వాణిజ్యం చేస్తున్నాయి. చైనా, రష్యా కంపెనీలు డబ్ల్యూటీఓ నిబంధనలు, మార్కెట్ సూత్రాలకు అనుగుణంగా సహకారం అందించుకుంటూ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మేము ఏ థర్డ్ పార్టీని కూడా లక్ష్యంగా ఎంచుకోలేదు. ఎవ్వరి ప్రయోజనాలను కూడా దెబ్బతీయట్లేదు. మా న్యాయమైన హక్కులను, ప్రయోజనాలను కాపాడేందుకు ఏం చేయాలో అది మాత్రమే చేస్తాం’ అని గుయో జియాకున్ చెప్పారు.