
న్యూఢిల్లీ: ఇంతకాలం పాకిస్తాన్‌కు మద్దతు పలుకుతూ, అమెరికాను వ్యతిరేకిస్తున్నట్లు కనిపించిన చైనా ఇప్పుడు తన పంథాను మార్చుకుంది. భారత్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రతిస్పందనను చూసి, చైనా తన తీరు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిచిన చైనా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన కఠిన వైఖరిని పునరుద్ఘాటించింది.
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్)ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడాన్ని సమర్థించారు. ఉగ్రవాదానికి వ్యతిరేక సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని ఆయన ప్రాంతీయ దేశాలకు పిలుపునిచ్చారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి టీఆర్‌ఎఫ్ బాధ్యత వహించింది. ఇది లష్కరే తోయిబాకు ప్రాక్సీ సంస్థ. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏప్రిల్ 25న ఈ దాడిని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో 2025, ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ మే 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించింది. నాలుగు రోజుల పాటు సరిహద్దుల్లో డ్రోన్,క్షిపణి దాడులు సాగాయి. అనంతరం ఈ సంఘర్షణ ముగింపునకు భారత్- పాకిస్తాన్ ఒక అవగాహనకు వచ్చాయి.