
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుసగా మూడవ రోజు జరిగిన హింసాత్మక నిరసనల్లో బుధవారం ఎనిమిది మంది పౌరులు మరణించారు. బాగ్ జిల్లాలోని ధిర్‌కోట్‌లో నలుగురు మృతిచెందారని, ముజఫరాబాద్‌లో ఇద్దరు, మీర్‌పూర్‌లో ఇద్దరు మృతిచెందారని ఎన్‌డీటీవీ తెలిపింది. మరణించిన నిరసనకారుల సంఖ్య 10కి చేరుకుందని అధికారవర్గాలు తెలిపాయి.
‘ప్రాథమిక హక్కుల ఉల్లంఘన’పై అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో గత 72 గంటలుగా భారీ నిరసనలు జరగడంతోపాటు మార్కెట్లు, దుకాణాలను పూర్తిగా మూసివేశారు. రవాణా సేవలను కూడా నిలిపివేశారు. దీంతో జనజీవనం అతలాకుతలయ్యింది. బుధవారం ఉదయం నిరసనకారులు ముజఫరాబాద్‌లో షిప్పింగ్ కంటైనర్‌లపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా పాక్ దళాలు జరిపిన కాల్పుల్లో పలువులు నిరసరకారులు మృతి చెందారు.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జనం అటు పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ ఆర్మీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాల తరబడి కొనసాగుతున్న దోపిడీ, పేదరికానికి వ్యతిరేకంగా అక్కడి జనం తిరగబడుతున్నారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ ఈ ఉద్యమాలను అణిచివేస్తోంది. అయితే ప్రజలు మరింతగా తిరగబడుతున్నారు. ఆర్మీ, పోలీసులపై దాడులు చేస్తున్నారు. ఆర్మీ వాహనాలను నదుల్లోకి విసిరేస్తున్నారు.
గత రెండు రోజులుగా ప్రజలు సైన్యం-పోలీసులకు ఎదురుతిరుగుతున్నారు. పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 10 మందికి పైగా మరణించినట్లు సమాచారం. వందలాది మంది గాయపడ్డారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ అల్లర్లను కవర్ చేసేందుకు అక్కడి మీడియాకు అనుమతినివ్వడం లేదు. 70 ఏళ్లుగా తమను అణిచివేసి, తమ వనరుల్ని కొల్లగొడుతున్నారని, తమ ప్రాథమిక హక్కుల్ని హరిస్తున్నారని నిరసనకారులు అంటున్నారు. అక్టోబర్ 1న పీఓకేలోని ముజఫరాబాద్ వరకూ లాంగ్ మార్చ్ చేపడతామని నిరసనకారులు ప్రకటించారు.