టొరంటో: అర్ధరాత్రి. ఎముకలు కొరికే చలి. ఏకంగా మైనస్ 23 డిగ్రీల అతి శీతల వాతావరణం. వెనక సీట్లో నిండు గర్భిణి ప్రసవ వేదన. టైర్లకు అస్సలు పట్టు దొరక్క రోడ్డుపై నుంచి పక్కలకు జారిపోతున్న కారు. ఇంకోవైపు నొప్పులు భరించలేక సీటును తంతూ, కేకలు పెడుతూ ఆమె పడుతున్న వేదన. పక్కనే కూచుని బిక్కచచి్చపోయి చూస్తున్న భర్త. ఆ అరుపుల్ని ఉంటూ, ఆమె బాధను వ్యూ మిర్రర్ లోంచి చూస్తూ, అత్యంత ప్రతికూలమైన ఆ పరిస్థితుల్లో తనను తక్షణం ఆస్పత్రికి చేర్చాల్సిన బాధ్యత. కెనడాలో భారత సంతతికి చెందిన హర్ దీప్ సింగ్ తూర్ అనే క్యాబ్ డ్రైవర్ తన వృత్తి జీవితంలోనే ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు ఇది.
దీనికి తోడు ప్రతి జంక్షన్ లోనూ రెడ్ సిగ్నల్స్. అయినా అన్నింటికీ తట్టుకుంటూ పళ్ల బిగువున దూసుకెళ్లారాయన. అయితే ఆస్పత్రి కనుచూపు మేరలో ఉండగానే కారు వెనక సీటులోనే ప్రసవించిందా మహిళ. అనంతరం కొన్ని క్షణాల్లోనే తల్లీబిడ్డా ఇద్దరినీ భద్రంగా ఆస్పత్రికి చేరవేసి ఊపిరి పీల్చుకున్నారు హర్ దీప్. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన గత శనివారం టొరంటోలో జరిగింది. ఆ అనుభవాన్ని ఆయన స్థానిక మీడియాతో పంచుకున్నారు. ‘ఇక ఇంటిముఖం పడదామని అనుకుంటుండగా ఓ బుకింగ్ వచి్చంది.
అర్జంటుగా ఆస్పత్రికి వెళ్లాలని చెప్పారు. తీరా పికప్‌కు వెళ్లాక నిండు గర్భిణిని ఆమె సహచరుడు అతి కష్టమ్మీద తీసుకొచ్చి వెనక సీట్లో పడుకోబెట్టాడు. కార్లో ప్రయాణం ఆమెకు సేఫ్ కాదనిపించింది. అంబులెన్స్ పిలుద్దామా అని ఆలోచించా. కానీ అర్ధరాత్రి, అంత చలిలో అది రావడానికి సమయం పడుతుంది. అంత ఆలస్యం చేస్తే ప్రమాదమని తెగించి బయల్దేరా. ఆ అరగంట డ్రైవ్ నా జీవితంలోనే అతి సుదీర్ఘమైనదిగా తోచింది. ఎలాగైతేనేం, చివరికి తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉండటం ఎంతో సంతోషాన్నిచి్చంది‘ అంటూ చెప్పుకొచ్చారు. ఇద్దరిని ఎక్కించుకుని ముగ్గురిని దించిన ఘనత తనకే దక్కిందంటూ నవ్వులు పూయించారు.


