సిడాన్: దక్షిణ లెబనాన్‌లోని సిడాన్ తీరప్రాంతం శివార్లలోని పాలస్తీనా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 13 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మరణాలను ధృవీకరించింది. ‘ఎన్‌డీటీవీ’ తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడి ఒక డ్రోన్ సాయంతో చేశారు. తొలుత మసీదు పార్కింగ్ స్థలంలో ఉన్న ఒక కారును ఢీకొట్టించారు. ఏడాది క్రితం ఇజ్రాయెల్-హిజ్బుల్లాల మధ్య కాల్పుల విరమణ తర్వాత లెబనాన్‌పై జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది.
ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) ఈ దాడిని ధృవీకరించింది. ఇది హమాస్ శిక్షణా ప్రాంగణం లక్ష్యంగా జరిగిందని పేర్కొంది. హమాస్ గ్రూపు ఎక్కడ పనిచేసినా వారిపై చర్యలు కొనసాగిస్తామని ఐడీఎఫ్ స్పష్టం చేసింది. గత రెండేళ్లుగా ఇజ్రాయెల్.. లెబనాన్‌పై వైమానిక దాడులను నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో హమాస్, హిజ్బుల్లా వంటి తీవ్రవాద వర్గాలకు చెందిన పలువురు నేతలు మరణించారు. 2024, జనవరి 2న బీరుట్‌లో జరిగిన డ్రోన్ దాడిలో హమాస్ కీలక నేత సలేహ్ అరౌరి మృతి చెందారు.
2023, అక్టోబర్ 7న హమాస్ దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడి చేసి దాదాపు 1,200 మందిని చంపిన తర్వాతి నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. నాటి దాడికి స్పందనగా ఇజ్రాయెల్.. గాజాపై దాడి చేసి, పదివేల మంది పాలస్తీనియన్లను హత్య చేసింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన మరుసటి రోజు నుంచే హిజ్బుల్లా.. ఇజ్రాయెల్ సరిహద్దు పోస్టులపై రాకెట్లను ప్రయోగించడం మొదలుపెట్టింది. ఈ ఘర్షణలు 2024 సెప్టెంబర్ చివరిలో పూర్తి స్థాయి యుద్ధంగా మారాయి.
2024 నవంబర్ చివరిలో అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ జరిగింది. అయినప్పటికీ, ఇజ్రాయెల్ లెబనాన్‌లో అనేక వైమానిక దాడులు నిర్వహిస్తూనే ఉంది. గత నాలుగు దశాబ్దాలలో హిజ్బుల్లాతో జరిగిన ఘర్షణల్లో లెబనాన్‌లో 4,000 మంది, ఇజ్రాయెల్‌లో 127 మంది మరణించారు. కాల్పుల విరమణ తర్వాత ఇజ్రాయెల్ సైనిక చర్యల కారణంగా లెబనాన్‌లో 270 మందికి పైగా మరణించారని, దాదాపు 850 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది.
ఇది కూడా చదవండి: ట్రంప్ కొత్త డ్రామా.. డీల్స్ కోసం ‘ఎంబీఎస్’కు క్లీన్‌చిట్


