
మైక్రో క్యాచ్‌మెంట్‌తో ముంపునకు చెక్!
సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలో ముంపు ముప్పు తప్పించడానికి అవసరమైన సమగ్ర ప్రణాళికలు రూపొందించి, చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో హైడ్రా రంగంలోకి దిగింది. ఆదివారం అమీర్‌పేట, ఎస్సార్ నగర్ ప్రాంతాల్లో పర్యటించిన సీఎం ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ ప్రాంతాలను మైక్రో క్యాచ్‌మెంట్ ఏరియాలుగా తీసుకుని, జీహెచ్‌ఎంసీ, జలమండలి సహకారంతో షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ స్ట్రాటజీలు సిద్ధం చేయాలని నిర్ణయించారు.
లోటుపాట్లు వెలుగులోకి..
నగరంలో వర్షం కురిసినప్పుడు అనేక ప్రాంతాలు మునిగిపోవడం ఏళ్లుగా జరుగుతోంది. ఇప్పటి వరకు యంత్రాంగాలు తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఇవ్వట్లేదు. ఈ ముంపు సమస్యకు పూర్తి పరిష్కారం చూపకుండా కేవలం ఓ చోట ఉన్న నీటిని చోటికి పంపిస్తున్నారు. ఈ కారణంగా నీట మునిగే ప్రాంతాలు మారుతున్నా.. సమస్యలు మాత్రం తీరట్లేదు. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో గ్రావిటీకి వ్యతిరేకంగా డ్రైనేజీ, వరద కాలువల నిర్మాణం, డిజైనింగ్, ఇంజినీరింగ్ లోపాలు ఉండటంతో ఇవి మరింత తీవ్రతరమవుతున్నాయి. ఇలాంటి అనేక కారణాల నేపథ్యంలోనే అమీర్‌పేట, ఎస్సార్‌నగర్‌ల్లో అనేక బస్తీలు, కాలనీలు చిన్నపాటి వర్షానికీ నీట మునుగుతున్నాయి. సీఎం పర్యటన నేపథ్యంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి పరిస్థితి నగరంలోని అనేక ప్రాంత్లాలో ఉంది.
ఎగువ నుంచి దిగువకు అధ్యయనం..
సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ అంశంపై దృష్టి పెట్టాలని నిర్ణయించిన హైడ్రా పశ్చిమ మండలంలోని ఎగువ నుంచి దిగువ ప్రాంతాల వరకు అధ్యయనం చేయనుంది. దీన్ని ఓ మైక్రో క్యాచ్‌మెంట్ ఏరియాగా తీసుకుని కురిసే వర్షం, నీటి ప్రవాహ తీరుతెన్నులు, వరద వెళ్లే దిశ, నిలిచే ప్రాంతాలను సాంకేతికంగా గుర్తించనుంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజీలు, నాలాల తీరుతెన్నుల్ని పరిగణనలోకి తీసుకుంటుంది. అక్కడ ఉండాల్సిన కుంటలు, చెరువులు.. ప్రస్తుతం ఉన్న వాటిలో వరద నిర్వ హణ చర్యలను అధ్యయనం చేస్తుంది. పార్కులుగా మారిపోయిన చెరువుల్లో ఇన్‌లెట్, ఔట్‌లెట్స్‌తో పాటు గేట్ల నిర్వహణను పరిగణనలోకి తీసుకుంటుంది. దీనికోసం అవసరమైతే ప్రైవేట్ కన్సల్టెన్సీల సహాయం తీసుకోవాలని హైడ్రా నిర్ణయించింది.
ఉపశమనంతో పాటు శాశ్వత పరిష్కారం..
వర్షాలు కురిసినప్పుడు నగరాన్ని ముంచెత్తుతున్న ముంపు సమస్యను పరిష్కరించడానికి హైడ్రా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ విధానాలను అమలు చేయడం ద్వారా తాత్కాలిక ఉపశమనంతో పాటు శాశ్వత పరిష్కారాలకు కృషి చేయనుంది. జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులతో కలిసి పశ్చిమ మండలాన్ని రోల్ మోడల్‌గా చూపించడానికి వెంగళరావునగర్ నుంచి అమీర్‌పేట వరకు వివిధ ప్రాంతాలను అధ్యయనం చేయనుంది. ఇప్పటికే హైడ్రా నగరంలోని వివిధ ప్రాంత్లాలోని ఆరు చెరువులను అభివృద్ధి చేసి, పునరుజ్జీవం కల్పిస్తోంది. ఇటీవల వర్షాలు కురిసినప్పుడు పరిస్థితుల్ని అధ్యయనం చేయగా... వీటి చుట్టుపక్కల ప్రాంతాల్లో గతం కంటే ముంపు తగ్గినట్లు తేలింది. ఆయా చెరువుల వద్ద తీసుకున్న చర్యలను అధ్యయనం చేసి ఇతర ప్రాంతాల్లో అమలుకు అనువుగా మార్పుచేర్పులతో ఓ విధానాన్ని రూపొందించనున్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన హైడ్రా
అమీర్‌పేట– ఎస్సార్‌నగర్ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా..
షార్ట్, మీడియం, లాంగ్‌టర్మ్ స్ట్రాటజీలతో ముందుకు