
చెరువు నీటిని మూసీకి తరలించేవి అవే..
సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల కురుస్తున్న వర్షాలు నగర జనజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్లు, కాలనీలు మునిగిపోయి నరకం చూపిస్తున్నాయి. ఈ పరిణామాలతో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగారు. రెండు రోజుల క్రితం విస్తృత స్థాయిలో సమీక్ష నిర్వహించగా... ఆదివారం ఆయన అమీర్‌పేట చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో పర్యటించారు. ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అధికారులతో భేటీ అయ్యారు. వీరి లక్ష్యం రాజధానిని ముంపు బారి నుంచి కాపాడటం. చెరువుల అలుగు పారిన తర్వాత ఆ నీటిని మూసీ వరకు చేర్చే నాలాలు కబ్జా కోరల్లో ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో ముంపునకు ఇదే కారణంగా నిలుస్తోంది. ఆక్రమణల తొలగింపు, విస్తరణ ద్వారా సమస్యను పరిష్కరిస్తే తప్ప ముంపు ముప్పు తప్ప పరిస్థితి కనిపించట్లేదని నిపుణులు చెబుతున్నారు. గడిచిన ఏడాది కాలంలో హైడ్రా 20 ప్రాంతాల్లోని నాలాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించి ఎనిమిది ఎకరాలను పునరుద్ధరించింది. ఈ వేగం మరింత పెరగాల్సిన అవసరం ఉంది.
నగరంలో నాలా ప్రభావిత ప్రాంతాలకు ఉదాహరణ..
● జల్‌పల్లి చెరువు–కొత్త చెరువు–పల్లె చెరువుల నుంచి నాలాల ద్వారా ప్రవహించే నీరు ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, డబీర్‌పురా మీదుగా ప్రవహించి మలక్‌పేట వద్ద మూసీలో కలుస్తుంది. పెద్ద వర్షం వచ్చిన ప్రతిసారీ ఈ మార్గంలోని ఆయిల్ మిల్, పారిశ్రామిక వాడ, ఫలక్‌నుమా, క్రాంతినగర్ తదితర ప్రాంతాలు ప్రభావితం అవుతుంటాయి.
● నాచారం పెద్ద చెరువు–నల్ల చెరువుల నుంచి నాలాల ద్వారా ప్రవహించే నీరు ఉప్పల్, పీర్జాదీగూడ మీదుగా ప్రవహించి పిర్జాదీగూడ వద్దే మూసీలో కలుస్తుంది. ఈ నాలాల కబ్జా వల్ల రాఘవేంద్రనగర్, ధర్మపురి కాలనీ, కావేరినగర్, న్యూ భరత్‌నగర్‌లతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోతున్నాయి.
● రామంతాపూర్ చెరువు నుంచి బయటకు వచ్చే నీరు ఇందిరానగర్, నేతాజీనగర్, శాంతినగర్ నాలాల్లో ప్రవహించి కేసీఆర్ నగర్ వద్ద మూసీ లో కలుస్తుంది. ఆయా చోట్ల నాలాలు పక్కాగా లేని కారణంగా మధురానగర్, మహేశ్వరి నగర్, సాయి చిత్ర నగర్, రవీంద్రనగర్ చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోతున్నాయి.
● జిల్లెలగూడ చెరువు–సరూర్‌నగర్ చెరువుల నుంచి బయటకు వచ్చిన నీరు చంపాపేట్, కర్మన్‌ఘాట్, తపోవన్‌న్ కాలనీ, చింతలబస్తీ కాలనీ, దిల్‌సుక్‌నగర్ వద్ద మూసీలో కలుస్తుంది. నాలాల సమస్య కారణంగా ఈ మార్గంలో ఉన్న మిథిలా నగర్, సత్యసాయినగర్, శ్రీధర్ కాలనీ, కోదండరామ్‌నగర్, వీవీ నగర్ తదితర ప్రాంతాలు నీట మునుగుతున్నాయి.
● రంగనాదముని చెరువు నుంచి బయటకు వచ్చే నీరు మూసాపేట, కూకట్‌పల్లి, ముంబై జాతీయ రహదారి మీదుగా ఫతేనగర్ నాలా నుంచి హుస్సేన్‌సాగర్‌కు చేరుతాయి. ఆక్రమణల కారణంగా నాలాలు కుంచించుకుపోయి జయ భారతి గార్డెన్, పవర్‌నగర్, శ్రీహరినగర్, స్వాండ్ లేక్, కూకట్‌పల్లి డిపో తదితర ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి.
● మైసమ్మ చెవురు నుంచి బయటకు వచ్చే నీరు భరత్‌నగర్, ప్రభాకర్‌రెడ్డి ప్రవహించి ఫతేనగర్ నాలాలో కలుస్తుంది. పరికి చెరువు బయటకు వచ్చే నీరు ఆల్విన్ కాలనీ, ధరణి నగర్, షిరిడీ నగర్ మీదుగా వచ్చే ఫతేనగర్ నాలా, గోపి చెరువు నుంచి బయటకు వచ్చే నీరు ఆర్సీపురం, చందానగర్ మీదుగా లింగంపల్లి నాలాలో కలుస్తుంది. ఈ నీరు పటాన్ చెరువు నక్కవాగుకు చేరుతుంది. ఈ మార్గాల్లో నాలాల కబ్జా తో అనేక ప్రాంతాలు మునిగిపోతున్నాయి.
చర్యలు కొనసాగితేనే ఫలితాలు...
● హైడ్రా ఆవిర్భావం నుంచీ చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణపై దృష్టి పెట్టింది. వర్షాకాలం సమీపిస్తున్న తరుణం నుంచి నాలాల కబ్జాలను పరిగణనలోకి తీసుకుంది. ఇప్పటికే కొన్ని ప్రాంత్లాల్లో ఆక్రమణల తొలగింపుతో పాటు నాలాల్లోని చెత్తను తొలగిస్తోంది. గతంలో జీహెచ్‌ఎంసీ సైతం వర్షాకాలం నేపథ్యంలో ఇలాంటి చర్యలు తీసుకున్నా వర్షాలు ఆగడంతోనే వారి ప్రాధాన్యం మారిపోయేది. హైడ్రా సైతం నాలాల విషయంలో ఇదే పంథా అనుసరిస్తే మరికొన్ని ఏళ్లు అయినా రాజధానికి ముంపు ముప్పు తీరదు. కనీసం కొన్నేళ్ల పాటు నాలాలపై ఉన్న ఆక్రమణల తొలగింపునకు అన్ని సమయాల్లోనూ సమ ప్రాధాన్యం ఇస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
● జలమండలి అధికారులు సైతం అవసరమైన ప్రాంతాల్లో కొత్త వరద కాల్వల నిర్మాణం, ఉన్న వాటి విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు. బండ్లగూడ చెరువు నుంచి నీరు కో–ఆపరేటివ్ బ్యాంక్ కాలనీ, మమత నగర్, నాగోల్ మీదుగా నాలాల్లో ప్రవహించి నాగోల్ వద్దే మూసీలో కలుస్తుంది. తరచూ ముంపునకు గురయ్యే ఇక్కడి ప్రాంతాల్లో స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రాంతో (ఎస్‌ఎన్‌డీపీ) చేపట్టిన పనులు ఫలితాలు ఇచ్చాయి. బండ్లగూడ, కో–ఆపరేటివ్ బ్యాంక్ కాలనీ, మమత నగర్, వెంకటరమణ కాలనీ తదితరాలకు వరదముప్పు తప్పిందిని వివరిస్తున్నారు. నగర వ్యాప్తంగా చెరువులతో పాటు నాలా ఆక్రమణల తొలగింపు, విస్తరణ తదితరాలు కొనసాగాలని స్పష్టం చేస్తున్నారు.
ఇప్పటికీ సిటీలోని అనేకచోట్ల ఆక్రమణలు
వీటి క్లియరెన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన హైడ్రా
వర్షాకాలం ముగిసిన తర్వాత కొనసాగించాలి
కుప్పకూలిన నాలా ప్రహరీ.. అధికారులేరీ?
వెంకటేశ్వరకాలనీ: బంజారాహిల్స్ రోడ్‌నెం. 1లోని ధోబీఘాట్ బస్తీని ఆనుకొని ఉన్న నాలా ప్రహారీ వరుసగా కురుస్తున్న వర్షాలకు కుప్పకూలింది. సుమారు 100 అడుగులకు పైగా పొడవులో ఈ గోడ కూలిపోయింది.. గోడ కూలిపోయిందని నాలాలో నుంచి వరద నీరు బస్తీని ముంచెత్తుతున్నదని జీహెచ్‌ఎంసీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని బస్తీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్తీలో సుమారు 200 మందికి పైగా నివాసాలు ఉన్నాయని వర్షం వచ్చినప్రతీసారి ఈ నాలా నుంచి వరద నీరు బస్తీని ముంచెత్తుతూ నడుముల్లోతు నీరు నివాసాల్లోకి వస్తోందని బస్తీవాసులు ఆవేదన చెందుతున్నారు.

చెరువు నీటిని మూసీకి తరలించేవి అవే..

చెరువు నీటిని మూసీకి తరలించేవి అవే..