
వ్యక్తి దారుణ హత్య
వ్యాపారాన్ని దెబ్బ తీశాడని
మియాపూర్: ఎక్కడో నుంచి ఇక్కడికి వచ్చి మన వ్యాపారాన్ని దెబ్బ తీశాడనే అసూయతో నలుగురు వ్యక్తులు కలిసి ఓ వ్యక్తిని హత్యచేసి ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శివ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా జంగమయ్యపల్లికి చెందిన శ్రీనివాస్ (37) మియాపూర్‌లోని హాఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో మంజీరా రోడ్డులో అయిదేళ్లుగా కర్రల వ్యాపారం చేస్తున్నాడు. ఇదే ప్రాంతంలో భార్య సోనీ, కుమార్తెలు రాధ, శివలీలతో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలంగా శ్రీనివాస్ కట్టెల వ్యాపారం వృద్ధిలోకి వచ్చింది. సమీపంలోనే వ్యాపారం చేస్తున్న సోహెల్‌తో పాటు మరో ముగ్గురు శ్రీనివాస్‌పై కక్ష పెంచుకున్నారు. శ్రీనివాస్ వ్యాపారం మంచిగా నడుస్తోందనే అసూయతో సోహెల్‌తో పాటు మరో ముగ్గురు ఆదివారం గొడవ పడ్డారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారం నడిపిస్తున్నాడనే కోపంతో అతడిని కత్తితో పొడిచి కర్రల దుకాణం వద్ద పడేసి పరారయ్యారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో అపస్మారకస్థితిలో పడి ఉన్న శ్రీనివాస్‌ను నిందితుల్లో ఒకడు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి పరారయ్యాడు. వైద్యులు చికిత్స చేస్తున్న క్రమంలో శ్రీనివాస్ మృతి చెందాడు. సోహెల్‌తో పాటు మరో ముగ్గురు నిందితులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.