
చెరువుకు జలకళ
● భారీ వర్షాలతో అలుగు పోస్తున్న మాసబ్ చెరువు
● ఇళ్ల మధ్య ప్రవహిస్తున్న వరద
తుర్కయంజాల్: వరుస భారీ వర్షాలతో తుర్కయంజాల్ మాసబ్ చెరువుకు జలకళ సంతరించుకుంది. వరద పోటెత్తడంతో అలుగు పారుతోంది. శనివారం సాయంత్రం కురిసిన వానతో చెరువు నుంచి పెద్ద మొత్తంలో నీరు బయటకు ప్రవహిస్తోంది. దీంతో సాగర్ రహదారిపై నుంచి రాకపోకలు సాగించే వాహనదారులు.. ప్రవాహాన్ని చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి 8 గంటల నుంచి ఇంజాపూర్‌లోని ఆపిల్ అవెన్యూ కాలనీలో ఇళ్ల మధ్యలో వాగుపై నిర్మించిన రోడ్డుపై అడుగున్నర మేర నీరు ప్రవహించింది. ఈ కాలనీలో గతంలో వెంచర్ నిర్వాహకులు.. వాగును కబ్జా చేసి దానిపై మూడు అడుగుల నాలాను నిర్మించిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు కురిసి.. చెరువు అలుగు పారినప్పుడు నీరు, కృత్రిమంగా నిర్మించిన నాలా పొంగి, ఇలా ఇళ్ల మధ్య నుంచి ప్రవహిస్తుంటుంది. ఇళ్లనుముంచెత్తుతుంది. ఆదివారం మధ్యాహ్నం వరకు వరద కొంత తగ్గుముఖం పట్టింది. దీంతో స్థానికులు చేపలను పట్టేందుకు ఉత్సాహం చూపారు. ఇంజాపూర్‌లోని ఇందిరమ్మ కాలనీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల చుట్టూ వరద చేరింది. దిలావర్‌ఖాన్ చెరువు నీరు ఉధృతంగా పరుగులు తీస్తోంది.