
కాలనీలను ముంచేశారు..!
మీర్‌పేట: పైనున్న కాలనీల కోసం కిందున్న కాలనీలను ముంచేశారు..! వర్షాకాలం వచ్చిందంటే మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మిథులానగర్, సత్యసాయినగర్ కాలనీలను వరదనీరు ముంచెత్తడం షరా మామూలే.. ఎన్నో ఏళ్లుగా ముంపునకు గురవుతున్నా... శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన చర్యలేవి ముంపు నుంచి విముక్తి కల్పించడం లేదన్నది వాస్తవమే. భారీ వర్షాలు రావడం.. ఇళ్లను, వీధులను ముంచెత్తడం ప్రతీసారి జరిగే పరిణామమే తప్పా సమస్య పరిష్కారానికి మాత్రం నోచుకోవడం లేదని ముంపు ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఆయా కాలనీలు పూర్తిగా ముంపునకు గురవడంతో చేసేది లేక రాత్రి నుంచి ఉదయం వరకు ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయమైనా వరద ప్రవాహం తగ్గకపోవడంతో సాయంత్రం వరకు ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
24 గంటలు ముంపులోనే..
మీర్‌పేట కార్పొరేషన్‌లో ముంపు సమస్య పరిష్కారం కోసం గతంలో గొలుసు కట్టు చెరువులకు అనుసంధానం చేస్తూ ఎస్‌ఎన్‌డీపీ నాలా, డ్రైనేజీ నీరు వేరుగా వెళ్లేందుకు ట్రంక్‌లైన్ నిర్మాణం చేపట్టారు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎగువన ఉన్న బడంగ్‌పేట కార్పొరేషన్ నుంచి పెద్దఎత్తున వరదనీరు వస్తుండడంతో పెద్ద చెరువులోకి వెళ్లాల్సిన నీటిని ట్రంక్‌లైన్‌లోకి మళ్లించడంతో ఓవర్‌ఫ్లో అయి మిథులానగర్, సత్యసాయినగర్‌లను ముంచెత్తింది. చెరువులోకి నీటిని మళ్లిస్తే ఎక్కడ బ్యాక్ వాటర్ తమ కాలనీలను ముంచెత్తుతుందోనని, ట్రంక్‌లైన్‌లోకి మళ్లించి తమ కాలనీలను ముంచెత్తారని మిథులానగర్ వాసులు పేర్కొంటున్నారు. ఇదంతా తెలిసినా మీర్‌పేట అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు వ్యవహరించడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాన్ని మిథులానగర్ వాసులు వ్యక్తం చేస్తున్నారు. ప్రతీసారి ఇదే పునరావృతం అవుతోందని, పైనున్న కాలనీలను రక్షించేందుకు కిందున్న కాలనీలను ముంపునకు బలి చేయడం సరైంది కాదని, 24 గంటలు తాము ముంపులోనే ఉన్నామని, నిత్యావసర వస్తువులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెరువులోకి వెళ్లాల్సిన వరదనీటిని ట్రంక్‌లైన్‌లోకి మళ్లింపు
ఓవర్ ఫ్లోతో పూర్తిగా జలమయమైన మిథులానగర్, సత్యసాయినగర్
రాజకీయ ఒత్తిళ్లతో ప్రతీసారి ముంపునకు గురవుతున్నామంటూ కాలనీవాసుల ఆవేదన