
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటిన సిటీ సెయిలర్లు
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ వేదికపై నగరానికి చెందిన 14 ఏళ్ల యువ సెయిలర్లు దండు వినోద్, నిరుడు బద్రీనాథ్ సత్తాచాటారు. చెక్ రిపబ్లిక్‌లోని లేక్ లిప్నోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఏడు యూరోపియన్ దేశాలు, ఆ్రస్టేలియా, భారత్ నుంచి వచ్చిన 104 బోట్లతో కూడిన అంతర్జాతీయ బృందాలను వినోద్, బద్రీనాథ్ అండర్ 17 క్యాడెట్ క్లాస్‌లో ఆశ్చర్యపరిచారు. మొత్తం 12 రేసుల్లో రెండు సింగిల్ డిజిట్ స్థానాలను, అందులో ఒక రేసులో రెండో స్థానాన్ని కూడా సాధించారు. ఓవరాల్‌గా 14వ స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకున్నారు. సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన వీరు యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. హెడ్ కోచ్ సుహీమ్ షేక్, మాజీ జాతీయ చాంపియన్ అయ్యాజ్ షేక్ పర్యవేక్షణలో కేవలం రెండు నెలల కఠిన శిక్షణతోనే క్యాడెట్ క్లాస్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించడం విశేషం.
నైపుణ్యం మెరుగుపర్చుకునే అవకాశం
2026 జులైలో ఇటలీలో జరగబోయే తదుపరి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆసియా క్రీడల కోసం 29 ఈఆర్, ఇంటర్నేషనల్ 420 వంటి పెద్ద బోట్లలో శిక్షణ కోసం సన్నద్ధమవుతున్నారు. 2000వ సంవత్సరం వరకు భారత్‌లో బాగా ప్రాచుర్యం పొందిన అండర్–17 క్యాడెట్ క్లాస్ సెయిలింగ్ బోట్‌ను సుహీమ్ కోచ్ చొరవతో ఇటీవల తిరిగి ప్రవేశపెట్టడం విజయానికి ఒక ప్రధాన కారణమైంది. ఇది యువ సెయిలర్లకు డబుల్ హ్యాండర్ విభాగంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాన్ని కల్పించింది. మాజీ జాతీయ క్యాడెట్ పుష్పరాజన్ ముత్తు ఈ బోట్‌ను అద్భుతమైన ఆవిష్కరణగా అభివర్ణించాడు. మొదటిసారి సెయిలింగ్ చేసేవారికి చాలా ఉత్తమమైన బోట్ అని హెడ్ కోచ్ సుహీమ్ షేక్ చెప్పారు.