breaking news
world chanpion ship
-
సత్తా చాటిన యంగ్ సెయిలర్లు
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ వేదికపై నగరానికి చెందిన 14 ఏళ్ల యువ సెయిలర్లు దండు వినోద్, నిరుడు బద్రీనాథ్ సత్తాచాటారు. చెక్ రిపబ్లిక్‌లోని లేక్ లిప్నోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఏడు యూరోపియన్ దేశాలు, ఆ్రస్టేలియా, భారత్ నుంచి వచ్చిన 104 బోట్లతో కూడిన అంతర్జాతీయ బృందాలను వినోద్, బద్రీనాథ్ అండర్ 17 క్యాడెట్ క్లాస్‌లో ఆశ్చర్యపరిచారు. మొత్తం 12 రేసుల్లో రెండు సింగిల్ డిజిట్ స్థానాలను, అందులో ఒక రేసులో రెండో స్థానాన్ని కూడా సాధించారు. ఓవరాల్‌గా 14వ స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకున్నారు. సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన వీరు యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. హెడ్ కోచ్ సుహీమ్ షేక్, మాజీ జాతీయ చాంపియన్ అయ్యాజ్ షేక్ పర్యవేక్షణలో కేవలం రెండు నెలల కఠిన శిక్షణతోనే క్యాడెట్ క్లాస్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించడం విశేషం. నైపుణ్యం మెరుగుపర్చుకునే అవకాశం2026 జులైలో ఇటలీలో జరగబోయే తదుపరి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆసియా క్రీడల కోసం 29 ఈఆర్, ఇంటర్నేషనల్ 420 వంటి పెద్ద బోట్లలో శిక్షణ కోసం సన్నద్ధమవుతున్నారు. 2000వ సంవత్సరం వరకు భారత్‌లో బాగా ప్రాచుర్యం పొందిన అండర్–17 క్యాడెట్ క్లాస్ సెయిలింగ్ బోట్‌ను సుహీమ్ కోచ్ చొరవతో ఇటీవల తిరిగి ప్రవేశపెట్టడం విజయానికి ఒక ప్రధాన కారణమైంది. ఇది యువ సెయిలర్లకు డబుల్ హ్యాండర్ విభాగంలో నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అవకాశాన్ని కల్పించింది. మాజీ జాతీయ క్యాడెట్ పుష్పరాజన్ ముత్తు ఈ బోట్‌ను అద్భుతమైన ఆవిష్కరణగా అభివర్ణించాడు. మొదటిసారి సెయిలింగ్ చేసేవారికి చాలా ఉత్తమమైన బోట్ అని హెడ్ కోచ్ సుహీమ్ షేక్ చెప్పారు. -
భారత జట్టులో ముగ్గురు తెలంగాణ షట్లర్లు
న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత బృందాన్ని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రకటించింది. బాలురు, బాలికల విభాగాల్లో కలిపి మొత్తం 23 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో ముగ్గురు తెలంగాణ షట్లర్లకు చోటు దక్కింది. బాలుర విభాగంలో ప్రణవ్ రావు గంధం, నవనీత్ బొక్కా, ఖదీర్ మొయినుద్దీన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనబోతున్నారు. బాలికల విభాగంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎవరూ ఎంపిక కాలేదు. ఆగస్టులో పంచకుల, బెంగళూరులలో జరిగిన ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో ప్రదర్శన, సాధించిన పాయింట్ల ఆధారంగా భారత జట్టును ఎంపిక చేశారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 13 వరకు రష్యాలోని కజాన్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. -
సైనాతో ‘ఢీ’కి సిద్ధం: సింధు
సైనాతో ‘ఢీ’కి సిద్ధం: సింధు న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్యంతో ఉరకలెత్తే ఉత్సాహంతో ఉన్న పి.వి. సింధు తన జోరు కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పింది. త్వరలో జరిగే ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో సహచర క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో సమరానికి సై అంటోంది. ‘నా తదుపరి లక్ష్యం ఐబీఎల్‌లో సత్తాచాటడం. ఇందులో మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు నా శక్తిమేర ప్రయత్నిస్తా. భారత నంబర్‌వన్ సైనాతో పోరుకు నేను రెడీగా ఉన్నా’ అని 18 ఏళ్ల ఏపీ స్టార్ సింధు తెలిపింది. సైనా హైదరాబాద్ తరఫున, సింధు లక్నో ఫ్రాంచైజీ తరఫున బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఈ నెల 15న డీడీఏ బ్యాడ్మింటన్ స్టేడియంలో జరిగే సమరంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘బాయ్’ నజరానా రూ.15 లక్షలు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన సింధుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ.15 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. ‘చైనాలో సింధు చూపించిన తెగువ ప్రశంసనీయం. అందుకే ఆమెకు రూ.15 లక్షల నజరానాను ప్రకటించాం. అంతర్జాతీయ సర్క్యూట్లో మంచి ఫలితాలను సాధించిన ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ముందుంటాం. వీరికి కేవలం సన్మానాలే కాకుండా నగదు రూపేణా సహాయం కూడా ఉంటుందని చెప్పదలుచుకున్నాం’ అని ‘బాయ్’ అధ్యక్షుడు అఖిలేష్ దాస్‌గుప్తా అన్నారు. క్రీడల మంత్రి ప్రశంస రాష్ట్ర క్రీడాకారిణి సింధును కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ‘అద్భుతమైన ప్రదర్శన చూపినందుకు అభినందనలు. దేశానికి గర్వకారణంగా నిలిచావు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి దేశానికి పేరు తేవాలని క్రీడా శాఖ కోరుకుంటోంది’ అని ఓ ప్రకటనలో మంత్రి కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ క్రీడల మంత్రి వట్టి వసంతకుమార్, క్రీడాశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్, ‘శాప్’ ఎండీ రాహుల్ బొజ్జా కూడా సింధును అభినందించారు.