
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ నియమించిన ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు చెంపపెట్టు అంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు(కేటీఆర్) అన్నారు.
‘‘గతంలో బీజేపీ.. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ పంపిన ఇద్దరు ఎమ్మెల్సీ ప్రతిపాదనలకు అడ్డుపడితే, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రక్రియ పెండింగ్‌లో ఉండగానే మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. బీఆర్ఎస్ గతంలో నామినేట్ చేసిన బడుగు, బలహీనవర్గాలకు చెందిన దాసోజు శ్రవణ్, సత్యనారాయణల అభ్యర్థిత్వాలకు అడ్డుతగిలిన కాంగ్రెస్, బీజేపీల నిజస్వరూపం మరోసారి బట్టబయలైంది’’ అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ దుయ్యబట్టారు.
‘‘రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేని ఈ రెండు ఢిల్లీ పార్టీల అప్రజాస్వామిక విధానాలు ఎంతమాత్రం సాగనివ్వమని చాటిచెప్పిన గౌరవ న్యాయవ్యవస్థకు బీఆర్ఎస్ పక్షాన శిరస్సు వంచి సలాం చేస్తున్నాం’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ నియమించిన ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నిక చెల్లదని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్ కు చెంపపెట్టు.
గతంలో బీజేపీ.. గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ పంపిన ఇద్దరు ఎమ్మెల్సీ ప్రతిపాదనలకు…— KTR (@KTRBRS) August 13, 2025