
అదనపు ఆదాయం లక్ష్యంగా సర్కారు నిర్ణయం
వాహనాల ఫ్యాన్సీ నంబర్ల ధరలు కూడా భారీగా పెంపు!
సాక్షి, హైదరాబాద్: కొత్త వాహనాల కొనుగోలు సమయంలో చెల్లించే జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్) మొత్తాన్ని ప్రభుత్వం సవరించింది. వాహన ధరల ఆధారంగా ఇప్పటివరకు అమలులో ఉన్న శ్లాబులను పెంచటం ద్వారా వీలైనంత మేర పన్ను ఆదాయం పెరిగేలా నిర్ణయం తీసుకుంది. ఆ సవరింపునకు సంబంధించి నోటిఫికేషన్ ఉత్తర్వు జారీ చేసింది.
ఇది గురువారం నుంచి అమలులోకి రానుంది. దీంతో పాటు వాహనాల ఫ్యాన్సీ నంబర్ల ధరలను కూడా భారీగా పెంచాలని నిర్ణయించింది. ఆ పెంపు మొత్తాన్ని వెల్లడిస్తూ అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా తెలపాల్సిందిగా నోటిఫికేషన్ జారీ చేయటం విశేషం. రవాణా శాఖ ద్వారా ఆదాయాన్ని పెంచుకునే యత్నంలో ఉన్న ప్రభుత్వం.. ఇటీవలే రిజిస్ట్రేషన్ చార్జీలను సవరించిన విషయం తెలిసిందే.
గతంలో 2..ఇప్పుడు 4
వాహనాల ధరల ఆధారంగా పన్ను మొత్తాన్ని నిర్ధారించే శ్లాబులు అమలులో ఉంటాయి. ఉదాహరణకు ద్విచక్రవాహనాలకు సంబంధించి పరిశీలిస్తే.. ప్రస్తుతం వాహనం ధర రూ. 50 వేల లోపు, వాహనం ధర రూ.50 వేల కంటే ఎక్కువ.. ఇలా రెండు శ్లాబులు మాత్రమే అమలులో ఉన్నాయి.
ఆ రెండు శ్లాబులకు నిర్ధారిత జీవితకాల పన్ను (వాహనం విలువలో నిర్ధారిత శాతం) కూడా ఖరారై ఉంది. తాజాగా వాహన ధర శ్లాబులను పెంచారు. వాహన విలువ రూ.50 వేల లోపు, రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు , రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు, రూ.2 లక్షల కంటే ఎక్కువ.. ఇలా శ్లాబుల సంఖ్యను నాలుగుకు పెంచారు.