
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో త్వరలో పర్యాటక పోలీసులు రాబోతున్నారు. రాష్ట్ర పర్యాటక ప్రదేశాలకు వచ్చే పర్యాటకుల భద్రత కోసం ప్రత్యేకంగా టూరిస్ట్ పోలీస్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ జితేందర్ వెల్లడించారు. డీజీపీ కార్యాలయంలో పర్యాటక శాఖ, పోలీస్ శాఖల సమన్వయ సమావేశం బుధవారం జరిగింది.
ఈ సమావేశంలో టూరిజం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ మహేష్ భగవత్, టూరిజం ఎండి వి.క్రాంతి, ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండి చ. ప్రియాంకతో పాటు సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మొదటి దశలో 80 మంది పోలీసు సిబ్బందిని టూరిజం శాఖకు కేటాయిస్తామని డీజీపీ తెలిపారు. వరల్డ్ టూరిజం డే సెప్టెంబర్ 27 నాటికి పూర్తిస్థాయి టూరిస్ట్ పోలీస్ సిస్టమ్ అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని డీజీపీ పేర్కొన్నారు.
అనంతగిరి, సోమశిల, రామప్ప, యాదాద్రి, పొచంపల్లి, నాగార్జునసాగర్, బుద్ధవనం, భద్రాచలం, అమ్రాబాద్ వంటి ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో ఈ యూనిట్లు పనిచేయనున్నాయని.. షూటింగ్ పర్మిట్లు, ప్రత్యేక ఈవెంట్ల నిర్వహణకు ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు. భద్రతా ఏర్పాట్ల కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ సిద్ధం చేయాలని డీజీపీ ఆదేశించారు. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తూనే, భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని డీజీపీ తెలిపారు.