పిల్లలకు ఫోన్ ఇచ్చి హుసేన్ సాగర్‌లోకి దూకిన మహిళ
ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణం
నాలుగేళ్ల క్రితం తండ్రి మృతి.
అనాథలైన చిన్నారులు
హైదరాబాద్: ‘‘పిల్లలూ..ఇక్కడ కూర్చొని ఈ ఫోన్‌తో ఆడుకోండి.. నేను కాసేపటి తరువాత వస్తా’’ అంటూ వెళ్లిన తల్లి అనంతలోకాలకు వెళ్లిపోయింది. అమ్మ.. ఇక రాదని తెలియని ఆ చిన్నారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నాలుగేళ్ల క్రితం తండ్రి మృతి చెందగా.. ఇపుడు అమ్మ కూడా పిల్లలను కూడా వదలి వెళ్లింది. హృదయ విదారకమైన ఈ సంఘటన శుక్రవారం జరిగింది. లేక్‌పోలీసులు తెలిపిన మేరకు.. పహాడీషరీఫ్‌కు చెందిన వసంత (29) భర్త లక్ష్మణ్ నాలుగేళ్ల క్రితం మృతి చెందాడు. వీరికి కుమారుడు నందు, కుమార్తె చెర్రి ఉన్నారు. భర్త మృతి అనంతరం సోదరుడు, తల్లితో ఉంటూ కూలీపనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఇటీవల కాలంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.
శుక్రవారం సాయంత్రం పిల్లలను తీసుకుని ట్యాంక్‌బండ్‌కు వచ్చింది. వారిని లవ్ హైదరాబాద్ దగ్గర బెంచీపై కూర్చోబెట్టి మొబైల్ ఫోన్ ఇచ్చి ఆడుకోమని చెప్పి వెళ్లింది. అయితే కాసేపటికే ఆమె హుస్సేన్ సాగర్‌లో దూకింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన చేరుకోగా అప్పటికే ఆమె నీటిలో మునిగిపోయింది. అదే ప్రాంతంలో గాలించగా మృతదేహం లభించింది. పిల్లల దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా మృతురాలు వసంతగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.


