
ట్రాఫిక్ సమస్య తాత్కాలికమే
లక్డీకాపూల్: నగరంలో వర్షం పడినప్పుడు తాత్కాలిక ట్రాఫిక్ సమస్య తప్ప ఎక్కడా ఎలాంటి ఇతర ఇబ్బందులు తలెత్తలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వాస్తవానికి ఇది ఇప్పటి సమస్య కాదన్నారు. వర్షాలు, నగరంలోని వరద పరిస్థితులపై ఆదివారం ఆయన జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నగరంలో అక్రమ నిర్మాణాల కారణంగా వరద నీరు రోడ్లపైకి వస్తోందని.. అందుకే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ప్రవేశపెట్టిందన్నారు. ఆకస్మికంగా తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ముందస్తు సమాచారం ఇచ్చినా కూడా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని... ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజల సహకారం కూడా అవసరమన్నారు. ప్రభుత్వం తరఫున సాంకేతిక పరిజ్ఞానంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నప్పటికీ అనుకున్న దానికన్నా ఎక్కువ వర్షం రావడంతో సమస్య తలెత్తుతోందని మంత్రి స్పష్టం చేశారు. ఎండా కాలంలో నీరు లేక ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్నాం.. ఇంత వర్షం పడుతున్నా నీటిని ఇంకడానికి అవకాశం లేకుండాపోయిందన్నారు. ఇప్పటికై నా ప్రజలు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. వర్షాల వేళ అన్ని విభాగాల సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు.
ఒక్క రోజులో సాధ్యం కాదు..
నగరం ఎదుర్కొంటున్న వరద సమస్యను ఒక్క రోజులో పరిష్కరించడం సాధ్యం కాదని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ప్రజలు సహకరిస్తే.. తొందరలోనే సమస్యలు రాకుండా చర్యలు చేపడతామన్నారు. శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు ప్రజారవాణాను ఎక్కువగా ఉపయోగించుకుంటే మంచిదన్నారు. వర్షం తగ్గాక అందరూ ఒకేసారి కాకుండా కొంత సమయం తీసుకొని రోడ్లమీదకు రావాలని సూచించారు. సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రజల సహకారం కూడా అవసరమే
వర్షాలు, వరద పరిస్థితులపై సమీక్షలో మంత్రి పొన్నం