
– ఎమ్మెల్యే రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: ‘బీజేపీలో చేరాలనుకునే నాయకులారా.. ఒకసారి ఆలోచించుకోండి, జర జాగ్రత్త’అంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియో విడుదల చేశారు. ‘బీజేపీలో చేరిన తరువాత మీ కార్యకర్తలకు ఏ పదవీ ఇప్పించుకోలేరు. మీకు టికెట్ గ్యారంటీ ఉండదు’అని హెచ్చరించారు. చేరినప్పుడు మొదటి వరుసలో సీటు, తరువాత చివరి సీటులో కూర్చుంటారని పేర్కొన్నారు. 11 ఏళ్లు అణచివేతను ఎదుర్కొన్నానని అన్నారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న కార్యకర్తల కోసం ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ‘విజయశాంతి, జితేందర్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి లాంటి నేతలు బీజేపీలో చేరారు. ఏమైంది? పార్టీని విడిచి వెళ్లిపోయారు’అని పేర్కొన్నారు. హిందుత్వానికి, దేశానికి మంచిపనులు చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అంటూనే ‘తెలంగాణ మా పార్టీ. మేం ఏం చెబితే అదే జరుగుతుంది’అని అనుకునే వారి వల్లే పార్టీ సర్వనాశనం అవుతోందని ఆరోపించారు. బీజేపీ తెలంగాణను పాలిస్తుందన్నారు.