
పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
బాలానగర్: ఫతేనగర్ ఫ్లైఓవర్‌కు సంబంధించిన పాత మెట్లు శిథిలావస్థకు చేరడంతో హైడ్రా అధికారులు మంగళవారం కూల్చేశారు. సోమవారం వీటి ద్వారా దిగుతుండగా కొన్ని విరిగిపడటంతో ఇద్దరు తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. ఈ విషయం తెలుసుకున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం ఆ ప్రాంతానికి వెళ్లి శిథిలావస్థకు చేరిన మెట్లను పరిశీలించారు. ప్రతి ఆదివారం సనత్‌నగర్‌లో సంత జరుగుతుందని, ఆ సందర్భంగా వందలాది మంది ఈ మెట్లను వినియోగిస్తారని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.
కూలడానికి సిద్ధంగా ఉన్న ఆ మెట్ల వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉందని, వర్షాకాలంలో ముప్పు ఎక్కువని గుర్తించిన రంగనాథ్ వాటిని కూల్చివేయాలని ఆదేశించారు. దీంతో హైడ్రా అధికారులు ఆ మెట్లను తొలగించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలో శిథిలావస్థకు చేరిన ఇలాంటి నిర్మాణాలను గుర్తించడానికి సివిల్ ఇంజినీరింగ్ నిపుణులతో తనిఖీ చేయాలని ఆదేశించారు. శిథిలావన్థలో ఉన్న వాటిని గుర్తించి కూల్చేయాలని సూచించారు. ఫతేనగర్ ఫ్లైఓవర్‌కు కొత్త మెట్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ సతీష్‌గౌడ్ పేర్కొన్నారు.