బంజారాహిల్స్: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతితో చెట్టాపట్టాలేసుకుని తిరిగి..ఆమెను గర్భవతిని చేసి..ఆపై ముఖం చాటేసిన యువకుడిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన ఓ యువతి (25)కి అదే ప్రాంతానికి చెందిన ఎన్.శివాచారితో 2020 ఆగస్టులో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని శివాచారి నమ్మించడంతో ఆమె సన్నిహితంగా మెలిగింది. ఇటీవలే శివాచారి కేపీహెచ్‌బీకి మకాం మార్చగా యువతి కూడా బంజారాహిల్స్‌కు వచ్చి ఓ ఆస్పత్రిలో పనిచేస్తూ హాస్టల్‌లో ఉంటుంది. ఇక్కడ కూడా తరచూ కలుసుకునేవారు. ఆమె రెండుసార్లు గర్భం దాల్చగా, బలవంతంగా మాయమాటలు చెప్పి గర్భస్రావం చేయించాడు. గత నెల నుంచి శివాచారి ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు గమనించింది. లోతుగా ఆరా తీయగా శివాచారికి ఆరు నెలల క్రితమే మరో యువతితో నిశ్చితార్ధం జరిగినట్లుగా తెలిసింది. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది. నాలుగు నెలల్లో పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నిందితుడు పెళ్లి చేసుకోగా మరో యువతితో నిశ్చితార్ధం చేసుకోవడమే కాకుండా తమ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని, వాట్సప్ బ్లాక్ చేశాడని, తనను మోసం చేశాడని బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శివాచారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి మాచర్ల పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.
పరీక్షల వేళ
భయాందోళన వద్దు
మొయినాబాద్‌రూరల్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు భయాందోళనకు గురికావొద్దని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్ ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ చైర్మన్ గౌరీ సతీష్ అన్నారు. మండల పరిధిలోని హిమాయత్‌నగర్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు. ఈనెల 5 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇంటర్‌బోర్డు నియమావళిని తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఉదయం 8.45 గంటలలోపు వచ్చిన వారినే పరీక్షలకు అనుమతించనున్నారని, ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరని చెప్పారు. సమయాన్ని పాటి స్తూ విద్యార్థులు 30 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాలకు వెళ్లాలని బోర్డు తొలిసారి నిబంధనలు అమలులోకి తెచ్చిందన్నారు. తల్లిదండ్రు లు విద్యార్థులను ప్రోత్సహిస్తూ.. పరీక్ష కేంద్రాలకు తగిన సమయానికి తీసుకెళ్లాలన్నారు. ఏవైనా సందేహాలుంటే 92402 05555 టో ల్‌ఫ్రీ నంబర్‌తో పాటు జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
క్రీడలను ప్రోత్సహించాలి
హుడాకాంప్లెక్స్: బీసీసీఐ వద్ద ఉన్న నిధులను ఇతర క్రీడలకు మళ్లించి క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కిగౌడ్ అభిప్రాయపడ్డారు. హీరో సుమన్ 50 ఏళ్ల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం ‘సుమన్ తల్వార్ లెజెండరీ కప్–2025’ పేరిట రాష్ట్ర స్థాయి ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మధుయాష్కి మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, మద్యం ఇతర వ్యసనాల బారిన పడుతూ జీవితాలను పాడు చేసుకుంటున్నారని, క్రీడలను అలవాటు చేసుకోవడం ద్వారా వారి జీవితాలను క్రమశిక్షణగా తీర్చిదిద్దుకోవచ్చని సూచించారు.
మద్యం తాగి
వాంతులు చేసుకుని..
వలస కూలీ మృతి
మొయినాబాద్: మద్యం తాగి వాంతులు చేసుకుని ఓ వలస కూలీ మృతి చెందాడు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధి అజీజ్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన నీలాంచల్ బెహెర(33) బతుకు దెరువుకోసం 3 ఏళ్ల క్రితం అజీజ్‌నగర్‌కు వలస వచ్చాడు. సోడా కంపెనీలో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో మద్యం తాగి పడుకున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో అక్కడే పనిచేసే అతని బంధువు ఈశ్వర్ మహకుల్ భోజనం చేయడానికి నీలాంచల్‌ను నిద్ర లేపాడు. ఆ సమయంలో వాంతులు చేసుకుని మళ్లీ పడుకున్నాడు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో నిద్రలేపే ప్రయత్నం చేయగా.. అతను లేవలేదు. వెంటనే స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచిగాంధీకి తీసుకెళ్లగా.. బెహెర చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.