రిజిస్ట్రేషన్ల శాఖలో కేడర్ స్ట్రెంత్ ఫిక్స్ చేసే యోచనలో ప్రభుత్వం
టైపిస్టు, షరాఫ్ పోస్టుల రద్దు!
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా ప్రస్తుత సిబ్బంది వివరాల సేకరణ
రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల
వివరాలను ఇవ్వాలని ప్రత్యేక ఫార్మాట్లు పంపిన ఐజీ కార్యాలయం
డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్, వచ్చే రాబడి ఆధారంగా సిబ్బంది పంపిణీ
మంత్రి పొంగులేటి సూచనతో పనికి అనుగుణంగా ‘సబ్ రిజిస్ట్రార్’ స్టాఫ్
సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో మరో కీలక సంస్కరణ అమలు కాబోతోంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆ శాఖ నిర్వహణ కోసం నిర్ధారించిన కేడర్ స్ట్రెంత్ కొత్తగా ఫిక్స్ కాబోతోంది. అయితే, ఈ కేడర్ స్ట్రెంత్‌ను నిర్ధారించిన తర్వాత మూస పద్ధతిలో శాఖ మొత్తానికి ఒకే విధంగా కాకుండా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పనిభారానికి అనుగుణంగా సిబ్బందిని పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త కేడర్ స్ట్రెంగ్త్ నిర్ధారణ కోసం ఏ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి ఎంత మంది అవసరమవుతారన్న వారి వివరాలను పంపాలని ఐజీ కార్యాలయం జిల్లా రిజిస్ట్రార్లను కోరింది.
తక్కువ పని.. తమిళనాడులో ఎక్కువ సిబ్బంది
వాస్తవానికి రాష్ట్రంలోని 143 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దాదాపు 1,170 మంది సిబ్బంది అవసరమవుతారని 20 సంవత్సరాల క్రితం అంచనా వేసి కేడర్ స్ట్రెంత్‌ను నిర్ధారించారు. అందులో ప్రస్తుతం 900 మంది మాత్రమే పనిచేస్తుండగా, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిన కొందరిని నియమించుకుని పని వెళ్లదీస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, మహారాష్ట్రలతో పోలిస్తే తెలంగాణలో స్టాంపుల శాఖలో పనిచేస్తున్న సిబ్బంది చాలా తక్కువగా ఉందని ఆ శాఖ వర్గాలంటున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో మన రాష్ట్రం కంటే తక్కువ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతాయని, రెవెన్యూ కూడా తక్కువ వస్తుందని, అయినా ఆ రాష్ట్రంలో 5వేల మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారని చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇక్కడ కేడర్ స్ట్రెంగ్త్‌ను పెంచాల్సిన అవసరం ఉందని అంటున్నాయి. ఇక, పనితీరు విషయానికి వస్తే గతంలో బిజీగా ఉండే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇప్పుడు పని భారం తగ్గింది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ శివార్లలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పని భారం పెరిగింది. అయినా ఆయా కార్యాలయాల్లో గతంలో ఎప్పుడో మంజూరు చేసిన సిబ్బందితోనే కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సిబ్బంది పంపిణీని పకడ్బందీగా చేపట్టాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి యోచిస్తున్నారు. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పద్ధతికి శ్రీకారం చుట్టిన ఆయన పనికి అనుగుణంగా సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
సిబ్బంది వివరాలు పంపండి..
ఈ నేపథ్యంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా పనిచేస్తున్న సిబ్బంది వివరాలను పంపాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు ఇటీవల జిల్లా రిజిస్ట్రార్లను ఆదేశించారు. ఈ మేరకు రెండు ఫార్మాట్లను క్షేత్రస్థాయికి పంపారు. అందులో గత రెండేళ్ల కాలంలో జరిగిన డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్, రాబడి వివరాలను ప్రాతిపదికగా తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న సబ్ రిజి్రస్టార్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, షరాఫ్‌లు, డ్రైవర్లు, ఆఫీస్ సబార్డినేట్ల వివరాలను పంపాలని, రెవెన్యూకు అనుగుణంగా అవసరమైన కేడర్ స్ట్రెంగ్త్ ఎంతో ప్రతిపాదించాలని కోరారు. కాగా, ఇప్పటికే కేడర్ స్ట్రెంగ్త్‌లో భాగమైన టైపిస్టులు, షరాఫ్ పోస్టులను రద్దు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
కంప్యూటర్ యుగంలో వీరి సేవలు పెద్దగా అవసరం లేనందున ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఇక, మరో ఫార్మాట్‌లో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు, ఆ పోస్టులు అసలు ప్రభుత్వం మంజూరు చేసిందా లేదా?, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల పేర్లు పంపాలని సూచించారు. ఉద్యోగులు లేకుండానే ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల నిర్వాహకులు తప్పుడు వివరాలిచ్చి వారి పేరిట వేతనాలను తీసుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో తమ శాఖలో నిజంగా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల లెక్క తేల్చేందుకే ఈ వివరాలు తీసుకుంటున్నారన్న చర్చ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో జరుగుతోంది.


