వారం రోజుల్లో.. గోదావరి రెండు, మూడో దశలకు టెండర్లు.. | - | Sakshi
Sakshi News home page

వారం రోజుల్లో.. గోదావరి రెండు, మూడో దశలకు టెండర్లు..

Feb 21 2025 8:53 AM | Updated on Feb 21 2025 4:50 PM

మల్లన్న సాగర్‌ నుంచి 20 టీఎంసీల తరలింపు

నగర తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు

జంట జలాశయాల పునరుజ్జీవనానికి 5 టీఎంసీలు

రెండేళ్లలో ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా చర్యలు

సాక్షి, హైద‌రాబాద్‌: మహా నగర తాగునీటి అవసరాల కోసం మరో 20 టీఎంసీల గోదావరి జలాలను తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభమైంది. మరో వారం రోజుల్లో గోదావరి (Godavari) తాగునీటి సరఫరా పథకం రెండు, మూడో దశ పనులకు టెండర్లు ఆహ్వానించేందుకు జలమండలి ఏర్పాట్లు పూర్తి చేసింది. సుమారు రూ.7,360 కోట్ల అంచనా వ్యయంతో హైబ్రిడ్‌ యాన్యూటీ మోడల్‌ (హ్యామ్‌) ప్రాజెక్టు పనులు చేపట్టనున్నారు. మొత్తం వ్యయంలో ప్రభుత్వ వాటా 40 శాతం, నిర్మాణ సంస్థ వాటా 60 శాతం భరించనున్నారు. ప్రభుత్వం తన వాటా నిధులను హడ్కో నుంచి రుణం తీసుకోనుంది. టెండర్‌ ప్రక్రియ పూర్తయిన నాటి నుంచి 24 నెలల్లో పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టనున్నారు.

రెండు వరుసల భారీ పైపులైన్‌..
కాళేశ్వరం (Kaleswaram) ఎత్తిపోతల్లో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి శామీర్‌పేట ఘన్‌పూర్‌ మీదుగా ఉస్మాన్‌సాగర్‌కు రెండు వరుసల భారీ పైపులైన్‌ నిర్మించనున్నారు. 3000 ఎంఎం డయాతో 50 కిలోమీటర్లు, 2,200 ఎంఎం డయాతో 58 కిలోమీటర్ల వరకు పైపులైన్‌ పనులు చేపట్టనున్నారు. ఘన్‌పూర్‌ వద్ద సుమారు 1170 ఎంఎల్‌డీల నీటిశుద్ధి ప్లాంట్‌ ఇతరత్రా నిర్మించనున్నారు. ఇందుకోసం సుమారు రూ.4,671 కోట్లు వినియోగించనున్నారు.

● సుమారు రూ. 596.88 కోట్ల అంచనా వ్యయంతో ఘన్‌పూర్‌ నుంచి ముత్తంగి జంక్షన్‌ వరకు సుమారు 40 కిలోమీటర్లు 2400 ఎంఎం పైపులైన్‌, దాని వెంట 3000 ఎంఎం డయా రింగ్‌ మెయిన్‌ను కలుపుతూ పైపులైన్‌ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపట్టనున్నారు.

● దాదాపు రూ. 300.09 కోట్ల అంచనాతో ఉస్మాన్‌ సాగర్‌లో 120 ఎంఎల్‌డీ, హిమాయత్‌సాగర్‌లో 70 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణ పనులు చేపట్టనున్నారు.

30 టీఎంసీల కేటాయింపు
గోదావరి జలాల్లో మహానగర తాగునీటి అవసరాలకు సుమారు 30 టీఎంసీల కేటాయింపు ఉంది. ఇప్పటికే గోదావరి మొదటి దశ కింద శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. రెండు, మూడు దశల కింద మిగిలిన 20 టీఎంసీలు తరలించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 20 టీఎంసీల్లో నగర తాగునీటి అవరాలకు 15 టీఎంసీలు, మిగిలిన 5 టీఎంసీలను ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ జలాశయాల పునరుజ్జీవనానికి వినియోగించనున్నారు. 

గోదావరి మొదటి దశలో జలాలను ఇప్పటికే మూడు రింగ్‌ మెయిన్‌ పైప్లెన్ల ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలకు అందిస్తున్నారు. రెండో దశ ప్రాజెక్టులో ఘన్‌పూర్‌ నుంచి నాలుగో రింగ్‌ మెయిన్‌ పైపులైన్‌ ముత్తంగి వరకూ నిర్మించనున్నారు. దీనిని ఇప్పటికే ఉన్న రింగ్‌ మెయిన్లకు అనుసంధానిస్తారు. మొత్తం మీద ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రెండోదశ నుంచి 150 ఎంజీడీలు, మూడోదశ నుంచి 150 ఎంజీడీల నీరు ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పరిధిలోని అన్ని ప్రాంతాలకూ సరఫరా జరిగే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement