అనైతిక వైద్యం! | - | Sakshi
Sakshi News home page

అనైతిక వైద్యం!

Jan 23 2025 8:54 AM | Updated on Jan 23 2025 8:54 AM

అనైతిక వైద్యం!

అనైతిక వైద్యం!

అల్లోపతి డాక్టర్లుగా చలామణి అవుతున్న ఆయుర్వేద వైద్యులు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు, రోగనిర్ధారణ కేంద్రాలు అడ్డదారులు తొక్కుతున్నాయి. గుట్టుగా లింగనిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు కనీస అనుభవం, అర్హత లేని వారితో చికిత్సలు చేయిస్తున్నాయి. ఆయుర్వేద వైద్యులు అల్లోపతి వైద్యులుగా చలామణి అవుతూ రోగులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. వనస్థలిపురం, హస్తినాపురం, తుర్కయాంజాల్‌, మీర్‌పేట్‌, బాలాపూర్‌, తుక్కుగూడ, శంషాబాద్‌, షాద్‌నగర్‌, చేవెళ్ల, ఆమనగల్లు కేంద్రంగా యథేచ్ఛగా ఈ దందా కొనసాగిస్తున్నాయి. ఇందుకోసం మార్కెటింగ్‌ ఏజెంట్లను నియమించుకోవడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే ఆర్‌ఎంపీలకు కమీషన్లు ఆశ చూపి అనైతిక వైద్యానికి పాల్పడుతున్నాయి. 2024 జులైలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి తొమ్మిది పడకల(జనరల్‌ సర్జరీ, ప్లాస్టిక్‌ సర్జరీ విభాగాలు) ఆస్పత్రి కోసం అనుమతి పొందిన కొత్తపేట అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి యాజమాన్యం ఏకంగా కిడ్నీ మార్పిడి చికిత్సలు చేయడం వివాదాస్పదమైంది.

మాస్క్‌లు ధరించి, చికిత్సలు..

జిల్లాలో స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, జనరల్‌ నర్సింగ్‌హోంలు, సాధారణ క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్స్‌ కలిపి సుమారు 2,300 వరకు ఉన్నట్లు అంచనా. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి గుర్తింపు పొందినట్లు చెప్పుకొంటున్న మెజార్టీ ఆస్పత్రులకు ఫైర్‌ సేఫ్టీ లేదు. ఒకరి పేరుతో అనుమతి పొంది.. మరొకరితో చికిత్సలు చేయిస్తున్నారు. బోర్డుపై పేర్లు కనిపించే వైద్యులెవరూ ఇక్కడ అందుబాటులో ఉండటం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ఆస్పత్రికి వస్తే కాంపౌండర్లు, స్టాఫ్‌ నర్సులు, ఫార్మసిస్టులే సీనియర్‌ వైద్యులుగా చలామణి అవుతున్నారు. రోగులు, వారి బంధువులు గుర్తించకుండా ముఖానికి మాస్క్‌లు ధరించి, సీనియర్‌ వైద్యుల ప్రిస్కిప్షన్‌ లెటర్లపై టెస్టులు, మందులు, ఇంజక్షన్లు రాస్తున్నారు. వనస్థలిపురం కాంప్లెక్స్‌ కేంద్రంగా పని చేస్తున్న ఓ ఆస్పత్రి ఏకంగా డిఫార్మసీ పూర్తి చేసిన ఇద్దరు వ్యక్తులతో పని చేస్తుండటం గమనార్హం. తుక్కుగూడ కేంద్రంగా పని చేస్తున్న ఓ డయాగ్నోస్టిక్‌ కేంద్రం ఏకంగా కడుపులో ఉన్నది ఆడ బిడ్డా.. మగ శిశువా చెప్పేస్తోంది. ఆర్‌ఎంపీలు, ఆశ వర్కర్లకు డబ్బుల ఆశచూపి, పెద్ద మొత్తంలో దోచుచుకోవడంతో పాటు చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారు.

తనిఖీల పేరుతో వసూళ్లు..

పారదర్శకంగా పని చేయాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఆస్పత్రి గుర్తింపు కోసం రూ.లక్ష కుపైగా, అదే రెన్యూవల్‌ కోసం రూ.50 వేలకుపైగా వసూలు చేస్తున్నారు. అడిగినంత ఇస్తే సరి ఫైర్‌ సేఫ్టీ, భవన నిర్మాణ అనుమతి, డాక్టర్‌ సర్టిఫికెట్లతో పని లేకుండానే అనుమతులు ఇచ్చేస్తున్నారు. నిరాకరించిన వాళ్లకు చుక్కలు చూపిస్తున్నట్ల ఆరోపణలు ఉన్నాయి. తరచూ సర్జరీలు వికటిస్తున్నా.. అనేక రోగులు మృత్యువాతపడుతున్నా.. పట్టించుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇటీవల తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యులు జిల్లాలోని పలు క్లినిక్‌లలో తనిఖీలు చేశారు. అర్హత లేని వైద్యులను గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఆయా ఆస్పత్రులను సీజ్‌ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా కొత్తపేట అలకనంద ఆస్పత్రి ఘటనతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.

అనుమతులు లేకుండా అడ్డగోలుగా క్లినిక్‌ల ఏర్పాటు

యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు

మీర్‌పేట్‌, బడంగ్‌పేట్‌, తుర్కయాంజాల్‌, తుక్కుగూడ కేంద్రంగా దందా

అలకనంద ఆస్పత్రి ఉదంతంతోజిల్లా వైద్యశాఖ అప్రమత్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement