27, 28 తేదీల్లో ‘ఇండియన్‌ డిజైన్స్‌ హాత్‌’ ఎగ్జిబిషన్‌ | - | Sakshi
Sakshi News home page

27, 28 తేదీల్లో ‘ఇండియన్‌ డిజైన్స్‌ హాత్‌’ ఎగ్జిబిషన్‌

Dec 11 2023 6:30 AM | Updated on Dec 11 2023 6:30 AM

- - Sakshi

వెంకటేశ్వరకాలనీ: పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని దేశంలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వస్త్రాలు, ఆభరణాలు, యాక్ససరీస్‌ను నగరవాసులకు అందించేందుకు ‘ఇండియన్‌ డిజైన్స్‌ హాత్‌’ పేరుతో ఫ్యాషన్‌ లైఫ్‌స్టైల్‌ ఎగ్జిబిషన్‌ను ఈ నెల 27, 28 తేదీల్లో బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో నిర్వహించనున్నట్లు చీఫ్‌ ఆర్గనైజర్‌ దెబాషిష్‌ ఛటర్జీ తెలిపారు. ఆదివారం బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.10లో ఏర్పాటు చేసిన సన్నాహక కార్యక్రమంలో ఎగ్జిబిషన్‌కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఎగ్జిబిషన్‌ మొదటి రోజున వచ్చే ప్రతీ సందర్శకుడికి ప్రత్యేక బహుమతులు ఉంటాయని తెలిపారు.

‘కార్పొరేట్‌ కాలేజీల్లో అక్రమంగా ముందస్తు అడ్మిషన్లు’

సాక్షి, సిటీబ్యూరో: పదవ తరగతి పరీక్షలకు ముందే అక్రమంగా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించిన కార్పొరేట్‌ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఉచిత విద్య వైద్య సాధన సమితి అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని రెండు కార్పొరేట్‌ సంస్థలు వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థికి రూ.10 వేల చొప్పున తీసుకొని సీట్ల బుకింగ్‌కు తెరలేపాయన్నారు. అంగట్లో సరుకు వలే సీట్ల అమ్మకాన్ని పెట్టారని, మోయలేని ఫీజులు మోపుతున్నారన్నారు. వాస్తవంగా రెండు విద్యా సంస్థలకు సంబంధించిన చాలా బ్రాంచ్‌లకు పర్మిషన్లు లేకున్నా కొనసాగుతున్నా యని ఆరోపించారు. ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రేక్షక పాత్ర పోషిస్తూ కార్పొరేట్‌ కాలేజీలకు వత్తాసు పలుకుతోందన్నారు. తక్షణమే ఇంటర్‌ బోర్డును ప్రక్షాళన చేసి సరైన సదుపాయాలు లేని కాలేజీల పర్మిషన్లు రద్దు చేయాలని, ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

అద్దె ఇవ్వడం లేదని..ఈఎస్‌ఐ ఆస్పత్రి భవనానికి తాళం

20 రోజులుగా తెరుచుకోని వైనం..

మేడ్చల్‌: సంవత్సరకాలంగా అద్దె చెల్లించకపోవడంతో ఆగ్రహించిన యజమాని ఏకంగా ప్రభుత్వ ఆస్పత్రి భవనానికే తాళం వేశాడు. వివరాల్లోకి వెళ్తే..మేడ్చల్‌ పట్టణం వినాయక్‌నగర్‌ కాలనీలో ఓ ప్రైవేటు భవనంలో ఈఎస్‌ఐ ఆసుపత్రి కొనసాగుతోంది. మేడ్చల్‌కు చెందిన వ్యక్తి భవనాన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం లీజుకు తీసుకుని నెలనెలా అద్దె చెల్లించే విధంగా అగ్రిమెంట్‌ చేసుకున్నారు. ఈఎస్‌ఐ లబ్ధిదారులకు వైద్యసేవలందిస్తున్నారు. అయితే..18 రోజుల క్రితం ఇంటి యజమాని ఆస్పత్రికి తాళం వేశాడు. తనకు రావాల్సిన అద్దె బకాయిలు చెల్లిస్తేనే ఆస్పత్రిని కొనసాగనిస్తానని కరాఖండిగా చెప్పేశాడు. దీంతో వైద్యసేవలందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించాలి

హిమాయత్‌నగర్‌: విద్యార్థులు సేవా దృక్పథాన్ని పెంచుకొని, సమాజాభివృద్ధికి తోడ్పడాలని పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, కేశవ్‌ మెమోరియల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ అధ్యక్షుడు జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి అన్నారు. నారాయణగూడలోని కేశవ్‌ మెమోరియల్‌ హైస్కూల్‌లో 1973–74వ సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి హాజరయ్యారు. చిన్నతనంలో కలిసి చదువుకున్న బాల్యమిత్రులను కలుసుకొని తమ అనుభవాలను పంచుకున్నారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేశవ్‌ మెమోరియల్‌ సొసైటీ నిర్వాహకులు విద్యార్థులకు విద్యతో పాటు నీతి, నిజాయితీ నేర్పుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో కేశవ్‌ మెమోరియల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ సంయుక్త కార్యదర్శి శ్రీధర్‌ రెడ్డి, కోశాధికారి ప్రభాకర్‌ రెడ్డి, డైరెక్టర్‌ నాగేశ్వరరావు, కేశవ్‌ మెమోరియల్‌ హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ సీహెచ్‌.బీఎస్‌.వాణి తదితరులు పాల్గొన్నారు.

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement