చీకటి నేరాలపై నిఘా! | - | Sakshi
Sakshi News home page

చీకటి నేరాలపై నిఘా!

Published Mon, Nov 20 2023 6:48 AM | Last Updated on Mon, Nov 20 2023 6:48 AM

-

మాఫియాలూ విజృంభించే సమయం

హుండీ, హవాలా దందాలపై డేగ కన్నేయండి

అధీకృత సంస్థల లావాదేవీలూ పరిశీలించండి

ఫేక్‌ కరెన్సీ ముఠాలపై నిఘా ముమ్మరం చేయండి

నకిలీ మద్యం, సైబర్‌ నేరాలూ విజృంభించే ప్రమాదం

ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తం చేసిన ఉన్నతాధికారులు

సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో బందోబస్తులు, పని ఒత్తిడి మాత్రమే కాదు... తెరపైకి కనిపించని సమస్యలు మరెన్నో ఉంటున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో గతానికి భిన్నంగా వ్యయం భారీగా పెరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటికీ మించి ఆందోళనకర కోణాలు ఉండచ్చని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ధనం, మద్యం ప్రవాహాలతో పాటు వీటితో ముడిపడిన మాఫియాలు సైతం విజృంభించే ప్రమాదం ఉందని, ఏమరుపాటుకు తావివ్వద్దని సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. వీటిపై అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రెండు దేశాల మధ్య జరిగే అక్రమ ద్రవ్య మార్పిడిని హవాలా, ఓ దేశంలోని వివిధ ప్రాంతాల మార్పిడిని హుండీ అంటారు. సాధారణంగా ఈ రెండు రకాలైన మార్గాలను పన్ను ఎగ్గొట్టేందుకు వ్యాపారస్థులు వినియోగిస్తుంటారు. ఎన్నికల సీజన్‌లో పార్టీలు, అభ్యర్థులు తమ అనధికారిక ఖర్చుల కోసం వీటినే ఆశ్రయిస్తాయని అనుమానిస్తున్నారు. ఈ రెండింటితో పాటు అవసరమైతే అధీకృత మార్పిడిదారుల లావాదేవీలనూ నిశితంగా పరిశీలించాల్సిందిగా అధికార వర్గాలు స్పష్టం చేశాయి. భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు పాకిస్థాన్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో పాటు అనేక ఉగ్రవాద సంస్థలూ నకిలీ నోట్లను ముద్రిస్తున్నాయి. వీటిని ఎక్కడికక్కడ స్థానికంగా ఏర్పాటు చేసుకున్న ముఠాల సాయంతో బంగ్లాదేశ్‌ మీదుగా పశ్చిమ బెంగాల్‌కు చేర్చి అక్కడ నుంచి వివిధ నగరాలు, పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. ‘ఎన్నికల ఖర్చుల’కు అవసరమైన డబ్బు కోసం అనేక మార్గాలను అన్వేషించే వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఫేక్‌ కరెన్సీని భారీ స్థాయిలో చెలామణి చేయడానికి ముఠాలు ప్రయత్నిస్తాయని అనుమానిస్తున్నారు. ఈ సమస్య ఇటీవల చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిపోయినా... ఎన్నికల సీజన్‌లో పెరగవచ్చని సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఈ నేరం చేస్తున్న గ్యాంగ్‌లకు తోడు డిమాండ్‌ ఆధారంగా కొత్తవీ పుట్టుకు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దుబాయ్‌ కేంద్రంగా జరిగే హవాలా వ్యవహారంలో ప్రతి ముఠాకూ రెండు చోట్లా ఏజెంట్లు ఉంటారు. నగదు పంపాల్సిన వారు దుబాయ్‌లో ఉన్న ఏజెంట్‌ను డబ్బును అందిస్తే... అతడి ద్వారా సమాచారం అందుకునే భారత్‌లోని ఏజెంట్‌ ఆ మొత్తాన్ని ఇక్కడ డెలివరీ చేస్తాడు. తాజాగా ఈ పంథా మారింది. దుబాయ్‌లో వ్యక్తుల నుంచి ఏజెంట్లు తీసుకున్న డబ్బు అక్కడున్న దుబాయ్‌ మాడ్యుల్‌తో పాటు పాకిస్థాన్‌లోని ప్రధాన సూత్రధారులు పంచుకుంటున్నారు. ఇక్కడ డెలివరీ చేయడానికి మాత్రం ఉత్తరాదిలో ఏర్పాటు చేసుకున్న ముఠాలతో సైబర్‌ నేరాలు చేయించి ఆ మొత్తాన్ని ఇక్కడ డెలివరీకి వినియోగిస్తున్నారు. ఇలాంటి ముఠాలు విశృఖలంగా పంజా విసురుతాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఓటర్లను ప్రలోభపరచడానికి మద్యాన్నీ భారీగా వినియోగిస్తుంటారు. ఖర్చుల లెక్కల్లో చూపించకుండా ఉండేందుకు అభ్యర్థులు అనేక మార్గాల్లో మద్యాన్ని కొనుగోలు చేయడానికి వెనుకాడరు. దీన్ని అదునుగా చేసుకుని నకిలీ మద్యం మాఫియా కూడా రెచ్చిపోతుందనేది ఉన్నతాధికారుల అంచనా. మిగిలిన మాఫియాల ప్రభావం నేరుగా ప్రజలపై లేకున్నా... నకిలీ మద్యం వల్ల మాత్రం తీవ్ర దుష్ఫరిణామాలు వెంటనే ప్రతిఫలిస్తాయని స్పష్టం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement