గ్రేటర్‌ జిల్లాల్లో మొత్తం 12 సెంటర్లే | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ జిల్లాల్లో మొత్తం 12 సెంటర్లే

Published Fri, Sep 22 2023 7:00 AM

- - Sakshi

హైదరాబాద్: హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో కిడ్నీ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, డయాలసిస్‌ కేంద్రాలు తగినంత సంఖ్యలో అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దాంతో పేద మధ్యతరగతి రోగులు కార్పొరేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తూ అప్పుల పాలవుతున్నారు. మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న రోగులు, ట్రాన్స్‌ప్లాంటేషన్‌ కోసం వేచి చూస్తున్నారు. అందరికీ వారి వారి అవసరాన్ని బట్టి వారంలో ఒకటి లేదా రెండుసార్లు లేదా మూడుసార్లు డయాలసిస్‌ చేయించుకుంటారు. కానీ వారి అవసరాలకు తగ్గట్టుగా డయాలసిస్‌ సెంటర్లు మాత్రం పెరగకపోవడం రోగులకి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.

రెండు జిల్లాల్లో పదకొండే..
► 
కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాల కంటే మెరుగైనవని అధికారులు చెబుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం ఒక్క హైదరాబాద్‌ జిల్లాలోనే 2,400 మంది రోగులు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారంలో రెండు మూడుసార్లు డయాలసిస్‌ కోసం ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న రోగుల సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉందని అంచనా.

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో కేవలం ఏడు డయాలసిస్‌ కేంద్రాలు ఉండగా, 34 లక్షల జనాభా ఉన్న రంగారెడ్డిలో కేవలం నాలుగు మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రి, నాంపల్లి ఏరియా ఆసుపత్రి, గోల్కొండ ఏరియా ఆసుపత్రి, మలక్‌పేట ఏరియా ఆసుపత్రి, నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో డయాలసిస్‌ కేంద్రాలు ఉన్నాయి. ప్రధానంగా పాతబస్తీ ప్రాంతానికి చెందిన అనేకమంది పేద రోగులు సాధారణంగా మలక్‌పేట్‌ ఏరియా హాస్పిటల్‌తో పాటు అక్కడి మహావీర్‌ ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌, నాంపల్లి ఏరియా హాస్పిటల్‌ , గోల్కొండ ఏరియా హాస్పిటల్‌ అస్రా హాస్పిటళ్లను ఎక్కువగా ఆశ్రయిస్తారు.

పెరిగిన రోగుల సంఖ్య..
‘ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని రాష్ట్ర ఆరోగ్యశ్రీలో విలీనం చేసిన తర్వాత హైదరాబాద్‌ జిల్లాలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య పెరిగింది. జిల్లాలో 2400 మంది రోగులు ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం నిర్వహిస్తున్న డయాలసిస్‌ కేంద్రాల్లో ఉచిత చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం రోగులకు రూ.2,000 పింఛను, ఉచిత బస్‌ పాస్‌లు కూడా అందజేస్తోంది. ప్రతి రోజు డయాలసిస్‌కు వెళ్లే రోగుల సేవల కోసం ప్రభుత్వం జిల్లాలోని 82 కేంద్రాలకు సింగిల్‌ యూజ్‌ డయాలిజర్‌లను అందజేస్తోంది’ అని జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్‌ చేసేందుకు అంగీకరించిన ప్రైవేటు ఆసుపత్రులతో కలిపితే 26 కేంద్రాల వరకూ జిల్లాలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆరోగ్యశ్రీ కార్డును అనుమతించాల్సి ఉన్నప్పటికీ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు సాకులు చెప్పి తప్పించుకుంటున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు.

‘రంగారెడ్డి జిల్లా పరిధిలో వనస్థలిపురం, షాద్‌నగర్‌, చేవెళ్ల, మహేశ్వరంలలో మాత్రమే సెంటర్లు ఉన్నాయి. ‘టీవల ఇబ్రహీంపట్నం మండలంలో ఓ సెంటర్‌ చేశారు. కానీ కొన్ని విద్యుత్‌ సమస్యల కారణంగా ఇది పనిచేయడం లేదు. సమస్యను పరిష్కరించిన తర్వాత మరో రెండు వారాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది’ అని రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌ (డీసీహెచ్‌ఎస్‌) జి. రాజు యాదవ్‌ చెప్పారు.

మేడ్చల్‌ జిల్లాలో ఒక్కటే..
ఇటీవలి కాలంలో అటు జనాభా పరంగా ఇటు రియల్‌ ఎస్టేట పరంగా శరవేగంగా వృద్ధి చెందుతున్న మేడ్చల్‌ జిల్లా పరిధిలో డయాలసిస్‌ సెంటర్ల వ్యాప్తి మాత్రం పుంజుకోలేదు. ఘట్‌కేసర్‌ ఏరియా ఆసుపత్రిలో ఉన్న 35 బెడ్స్‌ డయాలసిస్‌ కేంద్రం తప్ప స్థానికులకు మరేదీ అందుబాటులో లేదు. మేడ్చల్‌లో మరో సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్టు వైద్యాధికారులు అంటున్నారు.

ప్రైవేటులో బిల్లు తడిసిమోపెడు...
ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్‌ ఒక్క సిట్టింగ్‌కి కనీసం రూ.3వేల నుంచి రూ.4వేల వరకు వసూలు చేస్తున్నారు. దీంతో నిరుపేద, మధ్య తరగతి రోగులు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ‘వారానికి రెండుసార్లు తన మేనల్లుడికి డయాలసిస్‌ చికిత్స పొందేందుకు. ఆసుపత్రిలో స్లాట్‌ను పొందిన రహ్మెన్‌ మాట్లాడుతూ.. బహదూర్‌పురాలోని తమ ఇంటి దగ్గర అలాంటి సదుపాయం లేకపోవడంతో తమ 17 ఏళ్ల మేనల్లుడికి చికిత్స కోసం బంజారాహిల్స్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రిని ఎంచుకున్నామని చెప్పారు.

రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్‌లోని మా ప్రాంతానికి సమీపంలో ఎక్కడా అందుబాటులో లేకపోవడంతో కార్పొరేట్‌ ఆసుపత్రిలో సెషన్‌కు 3,500 రూపాయలకు పైగా ఖర్చు చేస్తూన్నా’మని చెప్పారామె. ఈ నేపథ్యంలో కిడ్నీ రోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మరిన్ని డయాలసిస్‌ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తీవ్ర ఇబ్బందుల్లో కిడ్నీ రోగులు

ఇబ్బందుల పాలవుతున్న బాధితులు

ప్రైవేట్‌లో వేలాది రూపాయలు పెట్టలేని దీనావస్థ

డయాలసిస్‌ కేంద్రాలను పెంచాలని సర్కారుకు వినతి

Advertisement
Advertisement