హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జామ్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో ఈ రోడ్డు! | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ జామ్‌ మొదటి స్థానంలో ఈ రోడ్డు

Published Tue, Sep 5 2023 6:44 AM

- - Sakshi

హైదరాబాద్: నగరంలో ఇది కీలకమైన రోడ్డుఅనునిత్యం ప్రముఖులు కూడా ప్రయాణిస్తుంటారు. అయితే ఈ మార్గంలో రద్దీ వేళల్లో ట్రాఫిక్‌ వాహనచోదకులకు నరకం చూపిస్తోంది. డ్రైవర్ల సహనానికి పరీక్ష పెడుతోంది. సదరు రూట్‌లో ఉన్న బాటిల్‌ నెక్స్‌తో పాటు కొన్ని వ్యాపార సంస్థల కారణంగానూ ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఏళ్లుగా ఇదే దుస్థితి ఉన్నా ట్రాఫిక్‌ విభాగం అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.


పంజగుట్టలోని నాగార్జున సర్కిల్‌ నుంచి పెన్షన్‌ ఆఫీస్‌ మీదుగా మాసబ్‌ ట్యాంక్‌ చౌరస్తా వరకు 2.9 కిలోమీటర్ల పరిధిలో రోడ్‌ నెం.1 ఉంటుంది. నిరంకారి–పంజగుట్ట మధ్య ఉన్న మార్గానికి ఇది సమాంతరంగా ఉంటుంది. రోడ్‌ నెం.1 మీదుగా అనునిత్యం ప్రముఖులు, ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగులు, సామాన్యులు సైతం ప్రయాణిస్తుంటారు. ఈ కారణంగానే రోడ్డు రోజూ రద్దీగానే ఉంటుంది. వెస్ట్‌జోన్‌ పరిధిలో ఉన్న అనేక కీలక ఆస్పత్రులకు వెళ్లి వచ్చే అంబులెన్సులతో హడావుడి కూడా ఎక్కువే. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు కూడా ఈ రోడ్డులో ఉన్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.1 మీదనే తాజ్‌ కృష్ణ, 1/10, 1/12 వంటి కీలక జంక్షన్లతో పాటు పోలీసు ఆఫీసర్స్‌ మెస్‌ ‘టి’ జంక్షన్‌ కూడా నిత్యం హడావుడిగానే ఉంటుంది.

రద్దీ వేళల్లో 45 నిమిషాల వరకు...
వెస్ట్‌జోన్‌ పరిధిలోని కొన్ని ప్రాంతాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్ళే ప్రయాణికులు సైతం రోడ్‌ నెం.1నే ఆశ్రయిస్తారు. మాసబ్‌ట్యాంక్‌ మీదుగా మెహదీపట్నం వరకు వెళ్ళి అక్కడే పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్‌ వే ఎక్కుతారు. దీంతో విదేశీయుల కోణంలోనూ ఈ రూట్‌ కీలకమే. ఈ రహదారిలో ఉన్న జంక్షన్లలో కొన్ని ఇరుకుగా ఉంటాయి. దీనికి తోడు కేర్‌ ఆస్పత్రికి సమీపంలో, 1/12 జంక్షన్‌ దాటిన తర్వాత రోడ్డు బాటిల్‌ నెక్‌గా మారుతుంది. వీటితో పాటు ఈ రహదారిలో ఉన్న రెండు ప్రముఖ బేకరీ కమ్‌ రెస్టారెంట్లకు వచ్చిపోయే వాహనాలు, ఓ మద్యం దుకాణం వద్ద ఆగే కొనుగోలుదారుల వెహికిల్స్‌తో తీవ్ర ట్రాఫిక్‌ జామ్స్‌ ఏర్పడుతున్నాయి. ఈ కారణాలతో రద్దీ వేళల్లో ఒక్కోసారి ఈ రూట్‌ దాటడానికి 45 నిమిషాల వరకు పడుతోంది. అంబులెన్సుల సైరన్‌ వినిపిస్తున్నా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటోంది.

వర్షం కురిస్తే మరీ ఘోరం...
సాధారణ రోజుల్లో పీక్‌ అవర్స్‌గా పిలిచే ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉంటాయి. ఇక వర్షం కురిసిన రోజుల్లో సమయాలతో సంబంధం లేకుండా రోడ్డు మొత్తం జామ్‌ అయిపోతుంది. ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికి అటు జీహెచ్‌ఎంసీ, ఇటు పోలీసు విభాగాలు సరైన చర్యలు తీసుకోవట్లేదు. గవర్నర్‌, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి అత్యంత ప్రముఖుల కదలికలు ఉంటే మాత్రమే ట్రాఫిక్‌ పోలీసుల హడావుడి కనిపిస్తుంది. సాధారణ రోజుల్లో ఈ అధికారులు తీసుకునే చర్యలు నామమాత్రమే. ఆయా వ్యాపార సంస్థల వద్ద రోడ్డుపై వాహనాలు ఆగినా, క్యారేజ్‌ వేల్లో రాంగ్‌ పార్కింగ్‌ చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదు. దీని ప్రభావం బంజారాహిల్స్‌ రోడ్‌.నెం.1 మొత్తమ్మీద ఉంటోంది. ఇకనైనా అధికారులు స్పందించి తమ ఇబ్బందులు తీర్చాలని వాహనచోదకులు కోరుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు సైతం ఈ రూట్‌లో గస్తీ వాహనాలు మోహరించాలని సూచిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement