ఫిలింనగర్‌లో దారుణం... | - | Sakshi
Sakshi News home page

ఫిలింనగర్‌లో దారుణం...

Jun 11 2023 6:42 AM | Updated on Jun 11 2023 6:42 AM

- - Sakshi

ఫిలింనగర్‌: ఫిలింనగర్‌లో దారుణం చోటుచేసుకొంది. మైనర్‌ బాలికను ఓ యువకుడు ప్రేమపేరుతో లోబర్చుకోగా...ఆ బాలిక గర్భం దాల్చింది. శనివారం తెల్లవారుజామున ఆ బాలిక మగశిశువుకు జన్మనిచ్చింది. ఏం చేయాలో తోచని ఆ శిశువును ఇంటిముందు రోడ్డుపై వదిలేసింది. హృదయ విదారకమైన ఈ ఘటన ఫిలింనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకొంది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్‌లోని పద్మాలయ అంబేడ్కర్‌ నగర్‌ బస్తీలో నివసించే మైనర్‌ బాలిక (17) శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో తన ఇంట్లో మగ శిశువుకు జన్మనిచ్చింది.

ఇందుకు తల్లి సహకరించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 3.14 గంటల ప్రాంతంలో బస్తీ నిద్రిస్తున్న సమయంలో నవజాత శిశువును పొత్తిళ్లలో పెట్టుకొని రోడ్డుపై వదిలేసి ఇంట్లోకి వెళ్లిపోయింది. కొద్ది సేపటి తరువాత గుక్కపెట్టి ఏడుస్తున్న చిన్నారి రోదనలు విన్న ఎదురింటి మహిళ బయటకు వచ్చి చూడగా చిన్నారి ఏడుస్తూ కనిపించింది. చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది. చిన్నారి ఎవరై ఉంటారని ఆరా తీస్తుండగా స్థానిక బస్తీ నేత సుధాకర్‌రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు 108 అంబులెన్స్‌లో చిన్నారిని నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి ఆరోగ్యంగానే ఉందని, వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉండగా ఈ చిన్నారిని ఎవరు వదిలేసి వెళ్లారు అన్న కోణంలో పోలీసులు ఇక్కడి సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఓ బాలిక చిన్నారిని ఎత్తుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంటి ముందు వదిలేసి తిరిగి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆరా తీస్తే అక్కడే నివసిస్తున్న బాలికగా స్థానికులు గుర్తించారు. ఎందుకిలా చేశావని అడిగితే ప్రేమించిన యువకుడితో గర్భం దాల్చిన విషయాన్ని, పెళ్లికి పెద్దలు అంగీకరించకుండా గొడవలు జరుగుతున్న పరిణామాలను పోలీసుల దృష్టికి తీసుకొచ్చింది.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన బాలస్వామి (24) అనే జేసీబీ డ్రైవర్‌తో ప్రేమ ఏర్పడిందని, కొద్ది రోజులు కలిసి తిరిగామని, ఈ నేపథ్యంలోనే గర్భం దాల్చినట్లు పోలీసులకు బాలిక ఫిర్యాదు చేసింది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడమే కాకుండా, రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతుండటంతో తాను గర్భం దాల్చిన విషయాన్ని దాచిపెట్టాల్సి వచ్చిందని బాధితురాలు పేర్కొంది. ఈ మేరకు ఫిలింనగర్‌ పోలీసులు బాలస్వామిపై పోక్సో చట్టం, ఐపీసీ 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement