హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో బుధవారం ఆషాఢ శుద్ధ పౌర్ణమి, గురుపౌర్ణమిని పురస్కరించుకుని రుద్రేశ్వరస్వామిని శాకంబరుడిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు మణికంఠశర్మ అవధాని, అర్చకులు ప్రణవ్, శ్రవణ్ ప్రభాత సేవ, గణపతి ఆరాధన, రుద్రేశ్వర శివలింగానికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం పలుగ్రామాల రైతులు అందించిన కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో స్వామివారిని శాకంబరుడిగా అలంకరించి మహాహారతి జరిపి భక్తులకు దర్శనానికి అనుమతించారు. పూజల్లో దేవాదాయశాఖ మాజీ కమిషనర్ అనిల్‌కుమా ర్, పద్మజ దంపతులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రుద్రేశ్వరసేవా సమితి సభ్యులు శ్రీనివాస్, జ్యోతి, అంజనేయులు, భువనగిరి మాధవరావు, వంశీ తదితరులు కూరగాయలు అందించిన వారిలో ఉన్నారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.
హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు సలహాలు, సూచనలు స్వీకరించడానికి డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు. గురువారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు హనుమకొండలోని వరంగల్–1 డిపో కార్యాలయం నుంచి డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో వివరించారు. హైదరాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు వివరించాలని, సలహాలు, సూచనలివ్వాలని కోరారు.
వరంగల్ క్రైం: దుగ్గొండి పోలీస్‌స్టేషన్ పరిధిలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తూ గతేడాది ఆకస్మికంగా మృతి చెందిన శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత చేతుల మీదుగా రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కును బుధవారం సీపీ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు డీసీపీ శ్రీనివాస్, హోంగార్డ్స్ ఆర్‌ఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఆగస్టు 1న వరంగల్ జిల్లా స్థాయి 6, 8, 10, 12, 14, 16, 18, 20, మెన్ – ఉమెన్ అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కిషన్, యుగంధర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎంపికై న క్రీడాకారులు ఆగస్టు 7, 8 తేదీల్లో జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే తెలంగాణ రాష్ట్ర స్థాయి కిడ్స్, జావలిన్ త్రో, యూత్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లా స్థాయి ఎంపికల్లో పాల్గొనే క్రీడాకారులు ఆగస్టు 1, ఉదయం 9 గంటలకు జనన ధ్రువీకరణ పత్రం లేదా పదోతరగతి మెమోతో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం యుగంధర్‌రెడ్డి 98665 64422 మొబైల్ నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
కాళోజీ సెంటర్: ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో డెవెలప్‌మెంట్ మేనేజర్, టైపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్స్, విలేజ్ లైఫ్ మిత్ర పోస్టుల ఎంపికకు ఆగస్టు 1న (శనివారం) నర్సంపేటలోని మండల సమాఖ్య కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బి.సాత్విక బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డెవలప్‌మెంట్ మేనేజర్, టైపిస్ట్ పోస్టులకు డిగ్రీ, ఆఫీస్ సబార్డినేట్, విలేజ్ లైఫ్ మిత్ర పోస్టులకు పదో తరగతి పాసైన వారు అర్హులని పేర్కొన్నారు.


