హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హన్మకొండ అర్బన్: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా సోమవారం (జూలై 13) జిల్లాలోని 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల వారికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య, విద్య, మహిళాశిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మొత్తం 2,08,441 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 1–2 సంవత్సరాల పిల్లలకు అర మాత్ర, 2 నుంచి 19 సంవత్సరాల వారికి పూర్తి మాత్ర అందజేస్తారని పేర్కొన్నారు. ఆల్బెండజోల్ పూర్తిగా సురక్షితమైన ఔషధమని, ప్రతి చిన్నారి తప్పనిసరిగా తీసుకునేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. నులి పురుగులతో రక్తహీనత, పోషకాహార లోపం, కడుపు నొప్పి, ఆకలి మందగించడం, చదువుపై ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, చెప్పులు ధరించడం, పరిశుభ్రమైన ఆహారం, తాగునీరు వినియోగించడం వంటి అలవాట్లు పాటించడం ద్వారా నులిపురుగుల సంక్రమణను నివారించవచ్చని కలెక్టర్ సూచించారు.
వరంగల్ జిల్లాలో 1,96,168 మందికి..
వరంగల్ జిల్లాలో 1–19 ఏళ్ల లోపు వారు 1,96,168 మంది ఉన్నారని ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రకాశ్ తెలిపారు. జిల్లాలోని 910 ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు 908 అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు మాత్రలు వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మాత్రలను బాలబాలికలకు అందేలా చూడాలని వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలను కోరారు. సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు స్వచ్ఛంద సంస్థలు కార్యక్రమ విజయవంతానికి కృషి చేయాలని సూచించారు.


