కామధేనువులా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

కామధేనువులా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు

Jul 14 2026 4:47 AM | Updated on Jul 14 2026 4:47 AM

ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీం ప్రారంభం: 31, అక్టోబర్‌, 2020
దరఖాస్తుల పరిష్కారం: 2024
జీడబ్ల్యూఎంసీ పరిధిలో నమోదైన దరఖాస్తులు 1,07 లక్షలు
క్లియరెన్స్‌ దరఖాస్తులు 17,000
ఎల్‌–1 వద్ద పెండింగ్‌ దరఖాస్తులు: 15వేలు
ఎల్‌–2 అధికారుల వద్ద 22 వేలు
వసూలైన మొత్తం: రూ.149 కోట్లు

వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్‌ ఓ ప్రైవేట్‌ ఉద్యోగి. నగరంలోని గవిచర్ల క్రాస్‌ రోడ్డులో పైసాపైసా కూడబెట్టి 200 గజాల ప్లాటు కొన్నాడు. 2020 ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 2023లో రూ. 25వేలు చెల్లించాడు. మూడేళ్లు గడుస్తున్నా ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ చేయడం లేదు. స్థలానికి ఇరిగేషన్‌, రెవెన్యూ నుంచి ఎన్‌ఓసీ అడుగుతున్నారు. ఎన్‌ఓసీ అందించని పక్షంలో రూ.30 వేల లంచం డిమాండ్‌ చేస్తున్నారు.

సోమిడి ప్రాంతానికి చెందిన రవికిరణ్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించాడు. బల్దియా నుంచి ఫోన్‌ ద్వారా సమాచారం అందించాలి. ప్రొసీడింగ్‌ కాపీ జారీ చేయాలి. కానీ, రెండేళ్ల నుంచి రవికిరణ్‌ ఎదురు చూస్తూ కార్యాలయాల చూట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అన్ని ధ్రువపత్రాలు ఉన్నా మామూళ్లు ముట్టజెబితేనే పరిష్కరిస్తామనే ధోరణితో ఆయా శాఖల సిబ్బంది కా చుకుని కూర్చున్నారు. ఇలా అనేక కారణాలు చె బుతూ బల్దియా టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ సిబ్బంది దరఖాస్తుదారులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు అమ్యామ్యాలు ముట్టజెడితేనే ఫైళ్లు క్లియరెన్స్‌ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వరంగల్‌ అర్బన్‌: ఇలా.. రవికిరణ్‌, శ్రీనివాస్‌ మాత్రమే కాదు. మరెందరో క్రమబద్ధీకరణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పరిశీలనలో మూడు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మొదట వరంగల్‌ మహా నగర పాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి డాక్యుమెంట్లు పరిశీలిస్తుండాలి. రెవెన్యూ ఉద్యోగులు ఆ స్థలం వివాదాస్పదంగా ఉందా? కేసులు ఉన్నాయా? ప్రభుత్వానిదా? ప్రైవేట్‌దా అని నిర్ధారించాలి. ఇరిగేషన్‌ ఉద్యోగులు క్రమబద్ధీకరించే స్థలం చెరువులు, కుంటలు, డ్యామ్‌లు, నీటి పారుదలకు సంబంధించిందా? కాదా చూడాలి. ఇలా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు పరిశీలిస్తుండంతో దరఖాస్తులు క్లియరెన్స్‌కు నోచుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దరఖాస్తుదారుల అవస్థలు

క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసిన యాజమానులకు అవస్థలు తప్పట్లేదు. ఈ దరఖాస్తులను కేటాయించిన ఉద్యోగులు వచ్చి పరిశీలించి వెళ్లిపోతుండగా, ఆ తర్వాత సమాచారం ఉండట్లేదనే ఆరోపణలున్నాయి. ఫీజు ఎంత మేరకు వేస్తున్నారు? మళ్లీ చేపట్టే ప్రక్రియ ఏమిటనే వివరాలు మాత్రం లభించడం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. పైగా కొంత మంది దరఖాస్తుదారులకు సెల్‌ఫోన్‌ ద్వారా సమాచారం కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. అత్యధిక శాతం ఽఅర్జీలు నిషేధిత జాబితాలో వెళ్లడంపై ఆందోళన నెలకొంది. ఇళ్ల మధ్య ఉన్న ప్లాట్లను కూడా నిషేధిత జాబితాలో పేర్కొనడం ఏంటని నగర వాసులు ప్రశ్నిస్తున్నారు.

దరఖాస్తులు ముట్టుకోని బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు

వరంగల్‌ మహానగర పాలక సంస్థ పరిధిలో 1.07లక్షల ఎల్‌ఆర్‌ దరఖాస్తులు నమోదయ్యాయి. 2020లో ఖాళీస్థలాల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) జీఓ 131 విడుదలైంది. దీని ప్రకారం ఆ ఏడాది ఆగస్టు 26 ముందు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారంతా అర్హులే అని ప్రకటించారు. న్యాయస్థానాల్లో వివాదంలో ఉండడంతో 2024లో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన, ప్రొసీడింగ్‌ జారీ ప్రక్రియ మొదలైంది. కానీ, బల్దియా టౌన్‌ ప్లానింగ్‌ భౌగోళిక ఆధారితం (గూగుల్‌ మ్యాప్‌)తో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల శాశ్వత స్థలాలను నిర్ధారించుకున్నారు. చెరువులు, కుంటలు తదితర సమస్యలు లేకున్నా నగరంలోని పలు ప్రాంతాల్లో ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌, ఇతర జోన్లకు మారిపోయాయి. ఇదే బల్దియా బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులకు కాసుల పంట పడిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను దళారులుగా ఏర్పాటు చేసుకుని వారి ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు న్నాయి. ఈ విషయమై బల్దియా ఇన్‌చార్జ్‌ రవీందర్‌ రాడేకర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. దరఖాస్తుదారులు ముందుకు రావట్లేదని, పరిష్కరిస్తామని పొంతన లేని సమాధానం చెబుతున్నారు.

సమగ్ర సమాచారం

రూ.30 వేల నుంచి రూ.లక్ష చెల్లిస్తేనే ఫైళ్లు క్లియర్‌

దళారులుగా లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు

లబోదిబోమంటున్న దరఖాస్తుదారులు

వివాదాస్పద స్థలాల నిరాకరణ

దరఖాస్తులు: 30 వేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement