వరంగల్ అర్బన్: ‘ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరించట్లేదు. మీరైనా మా సమస్యలకు పరిష్కారం చూపండి’ అని పలు కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ సెల్‌లో కమిషనర్ టి.వెంకన్న వింగ్ అధికారుల సమక్షంలో పౌరుల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 85 ఫిర్యాదులు రాగా, అందులో టౌన్ ప్లానింగ్‌కు అత్యధికంగా 42 వినతులు వచ్చాయి. ఇంజనీరింగ్ సెక్షన్‌కు 21, రెవెన్యూకు 15, హెల్త్, శానిటేషన్‌కు 4, తాగునీటి సరఫరాకు 2, ఉద్యాన విభాగానికి 1 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, ఎస్‌ఈ రాజ్‌కుమార్, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, డీఎఫ్‌ఓ శంకర్ లింగం, ఇన్‌చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, పన్నుల అధికారి రామకృష్ణ, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్‌బాబు, హెచ్‌ఓ లక్ష్మారెడ్డి, రాజేశ్ పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● 42వ డివిజన్ రంగశాయిపేట మద్దెల కుంట హిందూ శ్మశాన వాటిక పనులు పూర్తి చేయాలని అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కోరారు.
● 18 శాలినీ నగర్ నుంచి కట్టమల్లన్న వెళ్లే రహదారి గుంతలు పడిందని, నూతనంగా నిర్మించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.
● 29వ డివిజన్‌లోని రఘునాథ కాలనీ, ఓస్‌ఎస్‌ఆర్ నగర్‌లో తాగునీటి సమస్యను పరిష్కారించాలని సీపీఎం నాయకులు సింగారపు బాబు, అరూరి కూమార్ విన్నవించారు.
● వరంగల్‌లోని 16–2–323 ప్రాంతంలో రోడ్డు, డ్రెయినేజీ బ్లాక్ అయ్యిందని క్లియర్ చేయాలని మహ్మద్ రఫత్ కోరారు.
● 19వ డివిజన్ వివేకానంద కాలనీలో రోడ్డు 6, 7 ప్రాంతంలో వినాయక చవితి, దసరా, శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తామని, ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం పేరుకుపోయిందని, క్లీన్ చేయాలని ఉత్సవ సమితి ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
● 42వ డివిజన్‌లో సీసీ రోడ్డు, నాలాను ఆక్రమించి ఇంటి నిర్మాణం చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని స్థానికులు 3 సార్లు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
● 14వ డివిజన్ సాయినగర్‌లో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు వినతిపత్రం అందించారు.
● 15వ డివిజన్ గొర్రెకుంటలో వీధిలైట్లు వెలగడం లేదని ఎస్.రవి ఫిర్యాదు అందించారు.
● 29వ డివిజన్ రామన్నపేట, పాపయ్యపేట ప్రాంతాల్లో నల్లా నీళ్లు రావట్లేదని స్థానికులు వినతి పత్రం అందించారు.
● 23వ డివిజన్ తోట మైదానంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.
● 49వ డివిజన్‌ప్రగతి నగర్‌లో 50 ఫీట్ల రోడ్డు అసంపూర్తిగా నిర్మించారని, సైడ్ బర్మ్ వేయాలని అభివృద్ధి కమిటి ప్రతినిధులు కోరారు.
● హనుమకొండ గోపాలపురం శివసాయి నగర్‌లో రోడ్డును ఆక్రమించి అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
● హనుమకొండలోని గాంధీనగర్‌లో సీసీ రో డ్డు, డ్రెయినేజీలను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని కోరారు.
● హనుమకొండ కాజీపేటలోని అఫ్జల్ నగర్‌లో 24–1–138:3 ఇంటికి నల్లా కనెక్షన్ లేకున్నా రెండేళ్లుగా బిల్లు వస్తోందని రద్దు చేయాలని ఎం. రమాదేవి ఫిర్యాదు చేశారు.
● 3వ డివిజన్ ఆర్టీసీ కాలనీ రోడ్డు–8లో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు వినతి పత్రం అందించారు.
● వర్షాకాలం ప్రారంభమైనందున నాలాల్లోని వ్యర్థాలను, గుర్రెపు డెక్కను తొలగించాలని హనుమకొండ జిల్లా సీపీఎం కమిటీ కార్యవర్గ సభ్యుడు యం.చుక్కయ్య వినతి పత్రం సమర్పించారు.
ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా
పట్టించుకోవట్లేదు..
గ్రేటర్ గ్రీవెన్స్‌లో కమిషనర్ ఎదుట అర్జీదారుల ఆవేదన


