హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావివ్వకుండా వచ్చే సోమవారం నాటికి పెండింగ్ వినతులు పరిష్కరించాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురుకుల విద్యాసంస్థలను ప్రత్యేక అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేసి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణ, హాస్టళ్లలో దోమల నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అదేవిధంగా రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదును చేపట్టాలని సూచించారు. ఈప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 263 అర్జీలు అందగా, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అర్జీలు వెంటనే పరిష్కరించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణికి 211 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అందులో రెవెన్యూకు సంబంధించినవి 67, మున్సిపల్ శాఖ 55, హౌసింగ్ 29, ఇతర శాఖలకు సంబంధించినవి 60 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. ఈ మేరకు దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపిణీ చేస్తూ త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేష్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్వో విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్
చాహత్ బాజ్‌పాయ్
ప్రజావాణిలో 263 అర్జీల స్వీకరణ


