చెత్త బుట్టల లొల్లి !
వరంగల్ అర్బన్: నగరంలో తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ వివాదాస్పదంగా మారింది. కొన్ని కాలనీల్లో పంపిణీ చేసి, మరికొన్నింట్లో అందజేయలేదు. మాకెందుకు చెత్త బుట్టలందించరంటూ పలు కాలనీలవాసులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. కాగా, ఇంటింటా తడి, పొడి చెత్త వేరు చేసి సేకరించే పనిలో మరుమారు గ్రేటర్ వరంగల్ సీరియస్‌గా దృష్టి కేంద్రీకరించింది. కొద్ది నెలల క్రితం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, గుజరాత్‌లోని జైపూర్ సిటీల్లో మేయర్, కార్పొరేటర్లు, అధికారులు అధ్యయన యాత్ర చేపట్టారు. స్వచ్ఛతతో మంచి ఫలితాలు రాబట్టుగలుతున్న సిటీలను మార్గదర్శకంగా తీసుకున్నారు. అక్కడ లవలంబిస్తున్న విధానాలు ఇక్కడ అమలు చేసే పనిలో రెండు నెలలుగా శ్రమిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆశించిన మేర ఫలితాలు కనిపించకపోగా, అవరోధాలు ఎదురవుతున్నాయి.
రంగంలోకి 198 మంది వలంటీర్లు
స్వచ్ఛత భాగంలో నగరంలో ఇంటింటా తడి, పొడి చెత్త విభజన కోసం 198 మంది వలంటర్లను గుర్తించారు. వీరికి రెండు రోజులు శిక్షణ ఇచ్చారు. స్వచ్ఛ ఆటోల వెంట ఒక్కో వలంటీర్‌ను నియమించారు. వీరు రోజూ తిరుగుతూ ఇంటింటా తడి, పొడి చెత్త వేరు చేసే విధానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇళ్లవాసులను చైతన్య పరుస్తున్నట్లుగా వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ, ఎంత చెప్పినా చెత్త విభజన అంశం మళ్లీ మొదటికే వస్తోందని ఓ వలంటీర్ ఆందోళన వ్యక్తం చేశారు.
అంచనాలపై విమర్శలు
నగర వ్యాప్తంగా 2.15 లక్షల కుటుంబాలున్నాయి. ఇంటింటా తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేయాలంటే 4.30 లక్షల బుట్టలు అవసరం. కానీ, బల్దియా కేవలం 1.20 లక్షల బుట్టలను మాత్రమే కొనుగోలు చేసింది. మిగతా కాలనీల్లో చెత్త బుట్టల పంపిణీ కరువైంది. దీంతో ఆయా కాలనీల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ ఇంటికి తడి, పొడి చెత్త బుట్టలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కొన్నవి కొన్ని.. కావాల్సినవి మరెన్నో..
మాకెందుకివ్వరంటూ ప్రజల నిరసన
స్లమ్ ఏరియాల్లో పంపిణీ చేస్తాం: పాలకవర్గం పెద్దలు, అధికారులు


