వనదేవతల ఘనకీర్తి!
సారలమ్మ ఆలయాన్ని
పరిశీలించిన మంత్రి సీతక్క
ప్రపంచ స్థాయికి
సాక్షి ప్రతినిధి, వరంగల్/ములుగు/ఎస్‌ఎస్ తాడ్వాయి : భక్తుల కొంగు బంగారం, కోరిన కోరికలు తీర్చే సమ్మక్క–సారలమ్మలు, వనదేవతల ఘన కీర్తి ప్రపంచ స్థాయికి చాటి చెప్పేలా ఈసారి మహాజాతర నిర్వహించనున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. గిరిజన ఆదివాసీ సంప్రదాయాలు, చరిత్ర ఆధారాలు, పూజారుల అంగీకారంతో చేపట్టిన పునరుద్ధరణ పనులతో మేడారం ఆలయం ప్రపంచ చరిత్రలో ప్రత్యేక మైలురాయిగా నిలుస్తోందన్నారు. శుక్రవారం ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్‌లో మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌తో కలిసి మీడియా ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..ఆదివాసులు మూల పురుషులుగా ఉన్నారని, ప్రతి రెండేళ్లకోసారి జరిగే మహాజాతరలో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, గొట్టు గోత్రాలు, ఆచారాలు ప్రతిబింబించేలా ఉంటాయన్నారు.
రూ.251 కోట్లతో అభివృద్ధి పనులు..
తెలంగాణ ప్రభుత్వం రూ.251కోట్ల నిధులతో చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో మేడారం జాతర నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. రూ.101 కోట్లతో శాశ్వత నిర్మాణాలు, రూ.150 కోట్లతో మేడారం మాస్టర్ ప్లాన్, జాతర నిర్వహణ పనులు చేపట్టినట్లు వివరించారు. ప్రతి రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెల వెలుగుల్లో గిరిజనుల డోలు వాయిద్యాల నడుమ జిల్లా అధికారుల గౌరవ వందనంతో వనదేవతలు గద్దెలపైకి రావడంతో భక్తజనం పులకరిస్తారని పేర్కొన్నారు. ఈ మహాద్భుత ఘట్టం కోసం కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. జాతరలో మహిళా సంఘాల సభ్యులకు ప్రాధాన్యం ఇస్తూ వారికి బొంగు చికెన్, ఇప్పపువ్వు లడ్డు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేయించినట్లు సీతక్క వివరించారు.ఈ సమావేశంలో ములుగు ఆర్డీఓ వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రతిష్టాత్మకంగా మహాజాతర
మేడారం మహాజాతరను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. సుమారుగా 21 ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఒకే బృందంగా పనులు చేపట్టారు. 90 శాతంకు పైగా పనులు పూర్తయ్యాయి. సంక్రాంతి నుంచి అధికార యంత్రాంగం జాతర మోడ్‌లో ఉంటుంది.జాతర సమయంలో 30వేల మంది సిబ్బంది, జాతర అనంతరం 6వేల మంది విధులు నిర్వహించేలా ప్లాన్ చేశాం. జాతర ప్రాంతాన్ని 8 జోన్లుగా, 42 సెక్టార్లుగా విభజించి ప్రతి జోన్‌లో 8 మంది, ప్రతి సెక్టార్‌లో 30–40 మంది అధికారులు ఉండేలా డ్యూటీలు వేశాం.
– దివాకరటీఎస్, కలెక్టర్, ములుగు
బందోబస్తుకు
11వేల మంది పోలీసులు
జాతర సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తాడ్వాయి–మేడారం, పస్రా–మేడారం రోడ్లవెంట ప్రతి 2 కిలోమీటర్లకు ఒక చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. జాతర నిర్వహణకు సుమారు 20మంది ఐపీఎస్‌లు, ఇతర అధికారులు, పోలీసులు కలిపి 11వేల మంది సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నాం. భక్తులకు సేవలు అందించడానికి స్థానిక యువత సిద్ధంగా ఉన్నారు. జాతర పరిసరాలను 450 సీసీ టీవీ, 20 ప్రత్యేక డ్రోన్స్ నిఘాతో పర్యవేక్షణ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీని పర్యవేక్షిస్తారు.
– రాంనాథ్ కేకన్, ఎస్పీ, ములుగు
చరిత్రలో
ప్రత్యేక మైలురాయిగా మేడారం
రూ.251కోట్లతో ఏర్పాట్లు..
అవసరమైతే మరిన్ని నిధులు
మేడారం అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి
వనదేవతల మహాజాతరకు
అన్ని ఏర్పాట్లు..
మీడియాతో రాష్ట్ర మంత్రి సీతక్క
మేడారం సమీపంలోని కన్నెపల్లిలో గల సారలమ్మ ఆలయాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క శుక్రవారం పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టిన ఏర్పాట్లను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌తో కలిసి ఆమె పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. కన్నెపల్లి సారలమ్మ ఆలయాన్ని రంగులతో సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఆలయం వద్ద భక్తుల కోసం తాగునీటి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. అనంతరం జంపన్నవాగులో జరుగుతున్న పనులను పరిఽశీలించి త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.


