బీసీ ఉద్యోగుల జోలికి వస్తే తోలుతీస్తా
హన్మకొండ : బీసీ విద్యుత్ ఉద్యోగుల జోలికి వస్తే తోలు తీస్తానని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం వరంగల్ ఉర్సులోని ఓ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ బీసీ విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ నిర్వహించారు. ఈ సభలో ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతిబా పూలే, సావిత్రి బాయి పూలే చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చేపట్టిన బంద్ విజయవంతం కావడంతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. బీసీ విద్యుత్ ఉద్యోగుల్లా అన్ని ప్రభుత్వ శాఖల్లో బీసీ ఉద్యోగులు సంఘం ఏర్పాటు చేసుకుని ఏకం కావాలన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, సంస్థఽల్లోని కాంట్రాక్ట్, ఆర్టిజన్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్ మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేసి ఏప్రిల్ 1నుంచి నూతన వేతనాలు అమలు చేయాలన్నారు. ఈ మహాసభలో సంఘం 2026 నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను ఆర్.కృష్ణయ్య ఆవిష్కరించారు. నాయకులు నీలారపు రాజేందర్, నాగెళ్లి సదానందం, జి.బ్రహ్మేంద్ర రావు, ఎం.విజయ్‌కుమార్, ప్రేమ్ కుమార్, పి.యాదగిరి,బొబ్బిలి మురళి, ఎం.అశోక్ కుమార్, మారం శ్రీనివాస్, రంగు సత్యనారాయణ, నాగవెల్లి ప్రసాద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లు
పరిష్కరించాలి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య


