గాంధీ పేరు తొలగించడం సరికాదు
● హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు వెంకట్రామ్‌రెడ్డి
● బీజేపీ, బీఆర్‌ఎస్ రెండూ ఒకటే: నాయిని
హన్మకొండ చౌరస్తా: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడం దుర్మార్గమని హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో కలిసి శనివారం హనుమకొండలోని డీసీసీ భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇనగాల మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడంపై ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు గ్రామ పంచాయతీల్లో తీర్మానాలు, నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు దద్దరిల్లేలా కార్యాచరణ రూపొందించనున్ననట్లు తెలిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీజీ, కాంగ్రెస్ పార్టీల చరిత్రను తుడిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, గాంధీ పేరును తొలగించడమే అందుకు నిదర్శనమన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ రెండూ ఒక్కటే అన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ఉపాధీ హామీ పథకంలో గాంధీ పేరు మార్చడమే కాకుండా, రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోందన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టీపీసీ సెక్రటరీ దుద్దిళ్ల శ్రీనుబాబు, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, మామిండ్ల రాజు, విజయశ్రీ, నాయకులు వీసం సురేందర్‌రెడ్డి, మహ్మద్ జాఫర్, బీమా వినయ్ పాల్గొన్నారు.
హక్కులు కాలరాస్తున్న కేంద్రం
వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్
వరంగల్: కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో మహాత్మాగాంధీ పేరు మార్చడం, ఫొటోను తీసివేయడంతోపాటు చట్ట సవరణల పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులు కాలరాస్తోందని కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌అయూబ్ అన్నారు. పోచమ్మమైదాన్‌లోని అబ్నూస్ ఫంక్షన్‌హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో గ్రామ కమిటీ తీర్మానం మేరకు ఉపాధిహామీలో పనులను చేసేవారని, కొత్త చట్టంలో పనులు ప్రభుత్వమే నిర్ణయిస్తోందని పేర్కొన్నారు. 50 రోజులు రాష్ట్రంలోని సర్కారు నిధులు కేటాయించాలని కేంద్రం నిబంధనలు పెట్టడం సరికాదన్నారు. ఈనెల 20 నుంచి 30 వరకు ప్రతి గ్రామాల్లో నిరసనలు నిర్వహించి, తీర్మానాలు చేస్తామన్నారు. అనంతరం ప్లకార్డులతో రోడ్డుపై నిరసన తెలిపారు. సమావేశంలో సంగెం, గీసుకొండ, పర్వతగిరి, వర్ధన్నపేట, ఖిలావరంగల్ మండలాల అధ్యక్షులు మాధవరెడ్డి, శ్రీనివాస్, జాటోత్ శ్రీను, ఎద్దు సత్యం, ప్రకాశ్, నాయకులు జన్ను అనిల్‌కుమార్, గిన్నారం రాజు తదితరులు పాల్గొన్నారు.
గాంధీ పేరు తొలగించడం సరికాదు


