ఊరికెళ్తున్నారా.. ఇల్లు భద్రం
వరంగల్ క్రైం: సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు తరలివెళ్లే ప్రజలతో పాటు మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే ప్రజలు ఇళ్లల్లో చోరీలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ఈమేరకు శనివారం వరంగల్ సీపీ కార్యాలయంలో సీసీఎస్ పోలీసులు రూపొందించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు, చోరీలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, క్రైమ్స్ అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీలు సదయ్య, మధుసూదన్, ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
కొన్ని సూచనలు..
● సెలవుల్లో బయటికి వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్లు ఏర్పాటు చేసుకోవాలి.
● ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టం కానీ, డిజిటల్ లాకింగ్ సిస్టం కానీ అమర్చుకోవాలి. బీరువా తాళాలు ఇంట్లో బెడ్ కింద, బట్టల కింద పెట్టకుండా వెంట తీసుకెళ్లాలి.
● తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు, బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. లేదా వెంట తీసుకెళ్లాలి.
● ఊరికి వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి లేదా తెలిసిన వారికి విలువైన వస్తువులు ఇవొద్దు.
● వాహనాలు ఇంటి ఆవరణలోనే పార్క్ చేసుకోవాలి. చైన్‌తో లాక్ చేయడం మంచిది.
● ఇంటి గేటుకు తాళం వేయొద్దు. తాళం వేస్తే ఇంట్లో ఎవరూ లేరని దొంగలు గుర్తిస్తారు.
● నమ్మకమైన వ్యక్తులను మాత్రమే వాచ్‌మెన్, సెక్యూరిటీ గార్డ్, సర్వెంట్‌గా నియమించుకోవాలి.
● స్వీయ రక్షణకు 15 రోజుల స్టోరేజ్ కలిగి ఉన్న రక్షణ సీసీ కెమెరాలు అమర్చుకోవాలి.
● మొబైల్‌లో ఎప్పటికప్పుడు ఇంటి పరిసరాలు లైవ్ ప్రత్యక్షంగా చూసుకోవాలి.
● ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలి.
● ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి.
● ఇంట్లో ఏదో ఒక గదిలో లైట్ వేసి ఉంచాలి.
● పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి.
● ఇంటి ఎదుట చెత్తాచెదారం, న్యూస్ పేపర్లు పాలప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడాలి.
● అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి.
● ఇంటి తాళం చెవిని తలుపుల దగ్గర, పూల కుండీల్లో లేదా మ్యాట్స్ కింద దాచిపెట్టొద్దు.
● ఇంట్లో పనిచేసే వారి వివరాలు పోలీస్ స్టేషన్‌లో వెరిఫికేషన్ చేయించుకోవాలి.
వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్
కరపత్రం ఆవిష్కరణ


