బాలవికాసలో సంక్రాంతి సందడి
కాజీపేట రూరల్ : కాజీపేట ఫాతిమానగర్ బాలవికాస ట్రైనింగ్ సెంటర్‌లో శనివారం భారతీయ సంస్కృతీసంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించే సంక్రాంతి పండుగ 15 మంది కెనడా ప్రతినిధులతో నిర్వహించారు. 12 మంది కెనడా విద్యార్థులు, ముగ్గురు టీచర్లు వారం క్రితం బాలవికాస పథకాలను తెలుసుకోవడానికి ఇక్కడి గ్రామాల పర్యటనకు వచ్చారు. చివరి రోజు జరిగిన సంక్రాంతి సంబురాల్లో అందరూ సంప్రదాయబద్ధంగా పంజాబీ డ్రెస్‌లు వేసుకుని పాల్గొని ఆడిపాడారు. సంక్రాంతి ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టారు. గంగిరెద్దు నృత్యాలు, ఇక్కడి గ్రామీణ ప్రాంత వాతావరణాన్ని తిలకించి మంత్రముగ్ధులయ్యారు. భారతదేశంలో సంక్రాంతి సంబురాలు ఇంత గొప్పగా జరుగుతాయా? అని ఆనందం వ్యక్తం చేశారు. భోగి, సంక్రాంతి, కనుమగా మూడు రోజుల పాటు జరుపుకునే పండుగల విశిష్టతను విదేశీ ప్రతినిధులకు బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి వివరించారు. కార్యక్రమంలో శోభ, లత, సునీత, ఐటీ ప్రోగ్రాం మేనేజర్ శివరాం, సిబ్బంది పాల్గొన్నారు.
గొబ్బెమ్మలు పెట్టి ముగ్గులు వేసిన కెనడా దేశీయులు
గంగిరెద్దు నృత్యాలను చూసి కేరింతలు
బాలవికాసలో సంక్రాంతి సందడి
బాలవికాసలో సంక్రాంతి సందడి
బాలవికాసలో సంక్రాంతి సందడి


