డిజిటల్ లైబ్రరీతో సులభంగా సమాచారం
● ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్
ఎం.మధుసూదన్
విద్యారణ్యపురి : డిజిటల్ లైబ్రరీతో సమాచార సేకరణ సులభతరమైందని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం.మధుసూదన్ పేర్కొన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో లైబ్రరీ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్ అకడమిక్ లైబ్రరరీస్ నావిగేటింగ్ చాలెంజెస్ లెవరేజింగ్ అపార్చునిటీస్’ అనే అంశంపై రెండ్రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సభలో మధుసూదన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పరిశోధనలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించాలన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ హైదరాబాద్ అసిస్టెంట్ డైరెక్టర్ కోటేశ్వర్‌రావు మాట్లాడుతూ డిజిటలైజేషన్ చేసిన గ్రంథాలయాలు పూర్వ వైభవాన్ని పొందుతున్నాయని వివరించారు. ఈ సభలో ద్రవిడ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ అంజయ్య, పింగిళి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.సుహాసిని, సదస్సు కన్వీనర్ డాక్టర్ బి.యుగేందర్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
నేడు గార్లకు రానున్న
భావన, మేఘన మృతదేహాలు
● ముల్కనూరులో ఒకేచోట అంత్యక్రియలు
గార్ల : అమెరికాలో డిసెంబర్ 28వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో గార్ల మండలానికి చెందిన భావన, మేఘనరాణి మృతిచెందారు. కాగా శనివారం వారి మృతదేహాలు స్వగ్రామానికి రానున్నట్లు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గంగావత్ వెంకన్న శుక్రవారం తెలిపారు. ఎల్‌కేజీ నుంచి టెన్త్, ఇంటర్, ఇంజనీరింగ్ ఒకేచోట చదివారు. ఉన్నత చదువుల కోసం ఇద్దరు అమెరికాలో ఒకే రూమ్‌లో ఉండి విద్యనభ్యసిస్తున్నారు. అమెరికాలో క్రిస్మస్ సెలవులు రావడంతో కారులో విహారయాత్రకు వెళ్లి వారు మృతిచెందారు. వీరిద్దరి మృతదేహాలను ఒకేచోట ముల్కనూరు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు తల్లిదండ్రులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. 14రోజులుగా వీరి తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టిస్తుంది.
తక్కువ ధరకే మొబైల్ అంటూ..
● ఖాతా నుంచి రూ.86 వేలు మాయం
● పెద్దవంగరలో సైబర్ మోసం
పెద్దవంగర : యూట్యూబ్ షార్ట్స్ వీడియోను నమ్మిన ఓ యువకుడు సైబర్ మోసానికి బలయ్యాడు. ఖరీదైన మొబైల్ ను తక్కువ ధరకే ఇస్తామన్న ఆకర్షణీయమైన ఆఫర్ చూసి సెల్‌ఫోన్ వస్తుందని నమ్మిన అతడు సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి నగదు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై ప్రమోద్ కుమార్ గౌడ్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన శ్రీరాం సాయివెంకట్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. డిసెంబర్ 31న మొబైల్‌లో యూట్యూబ్ షార్ట్స్ వీడియోలు చూస్తుండగా ఖరీదైన ఫోన్ అతి తక్కువ ధరకే వస్తోందన్న ప్రకటన కనిపించింది. అది నిజమని నమ్మిన సాయివెంకట్ అందులోని నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇచ్చాడు. వెంటనే అవతలి నుంచి నిందితులు వాట్సాప్‌లో చాటింగ్ ప్రారంభించారు. మార్కెట్‌లో రూ.95 వేల విలువ చేసే సెల్‌ఫోన్‌ను కేవలం రూ.9,500కే ఇస్తామని సాయివెంకట్‌ను నమ్మించారు. ముందుగా రూ.899లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని కోరడంతో బాధితుడు ఈ నెల 7న వారు పంపిన క్యూఆర్ కోడ్ ద్వారా ఫోన్ పే చేశాడు. ఎప్పుడైతే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడో అప్పటి నుంచి అతడి మొబైల్ సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లింది. బాధితుడి ప్రమేయం లేకుండానే అతడి బ్యాంకు ఖాతా నుంచి పలు విడతలుగా రూ.86,700 డెబిట్ అయ్యాయి. మోసపోయిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
డిజిటల్ లైబ్రరీతో సులభంగా సమాచారం


