రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలి
వరంగల్ లీగల్: వాహనదారులు రోడ్డు భద్రతా ప్రమాణాలు తప్పక పాటించాలని హనుమకొండ జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ఇన్‌చార్జ్ ప్రధాన న్యాయమూర్తి బి.అపర్ణాదేవి అన్నారు. బుధవారం రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి ప్రారంభమైన ర్యాలీని జెండా ఊపి ఆమె ప్రారంభించారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ.. వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్టు ధరించి వాహనం నడపాలన్నారు. గత సంవత్సరం దేశంలో 4.5 కోట్ల ప్రమాదాలు జరిగాయని, కొంత భద్రతా ప్రమాణాలు పాటిస్తే ఇవి నిర్మూలించగలుగుతామని తెలిపారు. వాహనదారులు డ్రైవింగ్ చేసేప్పుడు మొబైల్ ఫోన్ వాడవొద్దని, అతి వేగం ప్రాణానికి హాని అని తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి జి.రామలింగం, న్యాయమూర్తులు శాంతిసోని, శ్రావణ స్వామి, బి.అనూష, ప్రియాంక సిరిసిల్ల, హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు, మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ జి.వేణుగోపాల్, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్ ప్రధాన న్యాయమూర్తి అపర్ణాదేవి


