
ఎంత మందినైనా తెచ్చుకో.. నేనొక్కడినే వస్తా
హన్మకొండ చౌరస్తా: ‘ఏడాదిన్నర మా కాంగ్రెస్ పాలనలో వరంగల్ అభివృద్ధిపై చర్చకు రావాలని అనేకసార్లు సవాల్ విసిరాం. నీకు ధైర్యం లేకుంటే ఎంత మందినైనా తెచ్చుకో, ఎక్కడికి రావాలో చెప్పు. నేనొక్కడినే వస్తా’ అంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరోసారి సవాల్ విసిరారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ అసమర్థ పాలనపై వంద ఆధారాలతో ముందుకు వస్తే ఇంతవరకు ఒక్కదానికీ సమాధానం లేదన్నారు. అభివృద్ధి అవాస్తవమైతే ముక్కు నేలకు రాస్తా.. నువ్వు చెప్పింది అబద్ధమైతే రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తప్పుకుంటే చాలని అన్నారు. బీజేపీ నేత సీఎం రమేష్‌తో కేటీఆర్ సమావేశం ఆంతర్యమేంటో ప్రజలకు తెలిసిపోయిందన్నారు. కవితకు మెక్‌డాల్, విస్కీ పేర్లే తెలుసనుకున్నా ఆమె కూడా ఎయిర్‌పోర్టుకు పేరు ఖరారు చేయడం హస్సాస్పదంగా ఉందని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌కు ఏం పేరు పెట్టాలో తెలుసన్నారు. మళ్లీ ఉద్యమించాల్సిన అవసరం ఉందంటున్న హరీశ్‌రావు ఎవరిపై ఉద్యమం చేస్తాడో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడని అన్నారు. పశ్చిమలో అన్న ఒకరితో, తమ్ముడు మరొకరితో తిరుగుతున్నారని అన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి డబుల్‌బెడ్ రూం ఇళ్లు పంపిణీ చేస్తామన్నారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివా సరావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, హనుమకొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ అజీజ్‌ఖాన్, కార్పొరేటర్లు పోతుల శ్రీమన్నారాయణ, జక్కుల రవీందర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ, బీసీ సెల్ జిల్లా చైర్మన్ బొమ్మతి విక్రమ్, నాయకులు నాయిని లక్ష్మారెడ్డి, బోడ డిన్నా, ఆనంద్, బంక సంపత్ పాల్గొన్నారు.
కేటీఆర్‌కు ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సవాల్