
ఫలితాలెన్నడో
మొదటి
సెమిస్టర్ పరీక్షల
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్,ఎక్స్,ఇంప్రూవ్‌మెంట్ )నిర్వహించి నాలుగు నెలలు పూర్తయినా నేటికీ కొన్ని విభాగాల ఫలితాలు విడుదల కావడం లేదు. కొన్ని విభాగాల ఫలితాలను ఇటీవలే విడుదల చేశారు. కాగా, పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 25 నుంచి నిర్వహిస్తున్నారు. పరీక్షలు నిర్వహించిన 40 రోజుల్లోనే ఫలితాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ మూల్యాంకనంలో జాప్యం చేస్తూనే ఉన్నారు. ఉదాహరణకు ఇంకా ఎంఏ తెలుగు, ఇంగ్లిష్, ఎమ్మెస్సీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ తదితర పలు విభాగాల ఫలితాలు వెల్లడించలేదు.
ఆన్‌లైన్‌లోనూ జాప్యమేనా?
కొన్ని సంవత్సరాలుగా కాకతీయ యూనివర్సిటీలో పీజీ కోర్సుల పరీక్షలు జవాబుపత్రాల మూల్యాంకనం ఆన్‌లైన్‌లోనే కొనసాగుతోంది. అధ్యాపకులు పరీక్షల విభాగానికి రాకుండానే కంప్యూటర్లలో డిపార్ట్‌మెంట్‌లోగాని, ఇంటివద్దగాని మూల్యాంకనం చేసుకునే అవకాశం ఉంది. అయినా సంబంధిత కొందరు అధ్యాపకులు మూల్యాంకనం చేయడంలో జాప్యం చేస్తున్నారని తెలుస్తోంది. ఆన్‌లైన్‌లోనే జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి మార్కులు కూడా పోస్టు చేస్తారు. విద్యార్థుల జవాబుపత్రాలను తొలుత ఇంటర్నల్‌గా యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో మూల్యాంకనం చేస్తారు. అవే జవాబుపత్రాలను సెకండ్ వాల్యుయేషన్‌కు (ఎక్స్‌టర్నల్‌గా) ఇతర యూనివర్సిటీల అధ్యాపకులకు కూడా ఆన్‌లైన్‌లోనే పంపి మూల్యాంకనం చేయిస్తారు. ఉదాహరణకు ఒక సబ్జెక్టు పేపర్‌పరీక్ష జవాబుపత్రంలో మొదటి మూల్యాంకనానికి, రెండో మూల్యాంకనానికి వచ్చిన మార్కుల్లో 16 మార్కుల వరకు తేడావస్తే మళ్లీ ఆయా పేపర్లను థర్డ్ వాల్యుయేషన్‌కు కూడా పంపుతారు. ఆ విధంగా అయితే కొంత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. పరీక్షలు నిర్వహించాక జవాబుపత్రాల వాల్యుయేషన్ ప్రక్రియలో జాప్యానికి పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కోడింగ్ స్కాన్ చేయించడంలోనూ జాప్యం జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి.
కేయూ పీజీ వివిధ విభాగాల్లో
ఇంకా వెల్లడించని రిజల్ట్
ఎదురుచూస్తున్న విద్యార్థులు
పీజీ కోర్సుల రెండో సెమిస్టర్
పరీక్షలు షురూ..
రెమ్యునరేషన్ చెల్లించడంలో జాప్యం..
వాల్యుయేషన్ రెమ్యునరేషన్ చెల్లించడంలో అధికారులు జాప్యం చేయడంతో అధ్యాపకులు మూల్యాంకనం పట్ల ఆసక్తి కనబర్చడం లేదు.అంతేగాకుండా ఎక్స్‌టర్నల్‌గా ఇతర యూనివర్సిటీల ఆచార్యులకు పంపినప్పుడు వారు కూడా వాల్యుయేషన్ చేయడంలో జాప్యం చేస్తున్నారని తెలుస్తోంది. ఫలితాలను సకాలంలో వెల్లడించకపోవడంతో విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. కొన్ని విభాగాల విద్యార్థులకు తమ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాల విడుదల కాకున్నా రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా మొదటి సెమిస్టర్ పరీక్షలు ఫలితం ఎలా ఉందో అనే అంశంపై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంటోంది. ఈ విషయంపై అదనపు పరీక్షల నియంత్రణాధికారి సౌజన్యను వివరణ కోరగా పలు విభాగాల కోర్సుల ఫలితాలు వచ్చాయని, ఇంకా కొన్ని కోర్సుల ఫలితాలు మూల్యాంకనం పూర్తికావొస్తుందన్నారు. ఈనెలాఖరులోపు మూల్యాంకనం పూర్తిచేయించాలని సంబంధిత అధ్యాపకులను కోరినట్లు తెలిపారు.

ఫలితాలెన్నడో