
రవాణా సేవలు మరింత ప్రియం
సాక్షి, వరంగల్ : రవాణా సేవలు మరింత ప్రి యమయ్యాయి. దీనికి సంబంధించిన జీఓను రవాణా శాఖ ఈ నెల 22న జారీ చేయగా ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విషయం తెలియక స్లాట్‌బుక్ చేసుకుని సోమవారం, మంగళవారం రెండురోజులు జిల్లా రవాణాశాఖ కార్యాలయాలకు వెళ్లిన వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అంతకంటే ముందు స్లాట్ బుక్ చేసుకున్న వాహనదారులు పాత ధరల ప్రకారం ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించారు. తీరా ఆర్టీఏ కార్యాలయానికి వచ్చిన తర్వాత పెరిగిన చార్జీలు చెల్లించాలని సిబ్బంది చెప్పడంతో విస్తుపోయారు. ఈ నెల 27న స్లాట్ బుక్ చేసుకున్న వారు మాత్రం పెరిగిన చార్జీలను ఆన్‌లైన్‌లో చెల్లించారు. అలాగే, వాహనాల బదిలీకి సంబంధించి ఆన్‌లైన్‌లో తీసుకోకపోవడంతో రవాణా శాఖ కార్యాలయాలకు వచ్చిన వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పాత వాహనాలకు సంబంధించి ఇన్వాయిస్ ధర ఆర్టీఏ సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్ కాకపోవడంతో వాహనాల బదిలీ కాలేదు. కంప్యూటరీకరణకు ముందున్న పాత వాహన ధరలు లేకపోవడంతో వాహనాలు బదిలీ కావడం లేదు. ఇందుకు సంబంధించి సర్వీస్ చార్జీని నిర్ణయించిన తర్వాతే వీటి సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముందని ఆర్టీఏ అధికారులు తెలిపారు.
సేవా రుసుముల పెంపుతో
వాహనదారుల ఇబ్బందులు
వాహన బదిలీలు కాకపోవడంతో
తప్పని తిప్పలు
ఇప్పటికే అమల్లోకి వచ్చిన ధరలు
సర్వీస్ చార్జీలు ఎంత పెరిగాయంటే..
2017లో దరఖాస్తు రుసుములు పెరగగా, ప్రస్తుతం ఆర్టీఏ సేవలకు సంబంధించిన సర్వీస్ చార్జీలు పెరిగాయి. ఇంతకుముందు ద్విచక్ర వాహన లెర్నింగ్ లైసెన్స్‌కు రూ.300 ఉండగా ప్రస్తుతం రూ.400, ద్విచక్ర, లైట్ మోటార్ వాహనానికి రూ.450 ఉండగా రూ.550కి పెరిగింది. ద్విచక్ర వాహన డ్రైవింగ్ లైసెన్స్‌కు రూ.1,035 ఉండగా, రూ.1,135, ఫోర్ వీలర్ వాహనం రూ.1,330 నుంచి 1,430కి పెరిగింది. టూ, ఫోర్ వీలర్, ట్రాక్టర్, ట్రాలీ, ఎల్‌ఎల్(లెర్నింగ్)కు రూ.600 నుంచి రూ.700, డ్రైవింగ్ లైసెన్స్‌కు 1,635 నుంచి రూ.1,735కి పెరిగింది. ఇతర లైసెన్స్‌లపై రూ.100 అదనపు సర్వీస్ చార్జీ చేస్తున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్, వాహన బదిలీ, ఇతర సేవలపై అధికంగా భారం పడనుంది. నాన్ ట్రాన్స్‌పోర్ట్ (ద్విచక్ర) వాహన ధర ఇన్వాయిస్‌పై 0.5 శాతం, కార్లు అయితే ఇన్వాయిస్‌పై 0.1 శాతం సర్వీస్ చార్జీ చెల్లించాల్సి వస్తుంది. వాహన బదిలీకి గతంలో రూ.935 ఉండగా ప్రస్తుతం రూ.1,405 (వాహనాన్ని బట్టి) పెరిగింది. ట్యాక్స్ (త్రైమాసిక పన్ను) రూ.500లోపు అయితే రూ.25 సర్వీస్ చార్జ్ ఉండగా రూ.50కు, రూ.500పైనా అయితే రూ.50 ఉండగా రూ.100కు పెంచారు. ఎన్‌ఓసీకి రూ.100 ఉండగా రూ.690కి పెరిగింది.