
ఆపరేటర్ పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు
హన్మకొండ: కొత్త సబ్ స్టేషన్ల మంజూరుతోపాటు ఆపరేటర్ పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి చెప్పారు. మంగళవారం హనుమకొండ వడ్డేపల్లి రోడ్డులోని టీఎస్‌ఈఈయూ–327 కార్యాలయం పల్లా రవీందర్ రెడ్డి భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–327 ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ట్రాన్స్‌కో, టీజీ జెన్‌కోకు చెందిన ఆర్టిజన్ ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే సబ్ స్టేషన్ ఆపరేటర్ల పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఉద్యోగులకు బీమా సౌకర్యం కల్పించినట్లు వివరించారు. ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.ఉద్యోగులు విధిగా భద్రతాప్రమాణాలు పాటించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతీ సబ్ స్టేషన్‌కు సెల్‌ఫోన్ ఇచ్చామని, తద్వారా ఎల్‌సీ యాప్‌ను సులువుగా వినియోగించొచ్చన్నారు. జీరో ప్రమాదాల లక్ష్యంగా విధులు నిర్వర్తించాలన్నారు. అంతకు ముందు టీఎస్‌ఈఈయూ–327 రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్.. ఆర్టిజన్ల సమస్యలు వివరించి వాటిని పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా పర్వతగిరి మండలం ఏనుగల్‌కు చెందిన అన్‌మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ అస్లావత్ బాలోజీ విద్యుత్ ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోగా టీఎస్‌ఈఈయూ–327 ఆధ్వర్యంలో రూ.70 వేల ఆర్థిక సాయాన్ని సీఎండీ వరుణ్ రెడ్డి చేతుల మీదుగా బాలోజీ భార్య లలిత, కుమారులకు అందించారు. సమావేశంలో టీఎస్‌ఈఈయూ రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం ఐలేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు పి.మహేందర్ రెడ్డి, కార్యదర్శి కొండూరి శ్రీనివాస్, టీజీ ఎస్పీడీసీఎల్ కంపెనీ కార్యదర్శి భూపాల్‌రెడ్డి, జెన్‌కో అధ్యక్షుడు మాధవ రావు, నాయకులు తులసి శ్రీమతి, ధరావత్ సికిందర్, గన్ను నరేందర్ రెడ్డి, సతీశ్‌రెడ్డి, వల్లాల యుగంధర్, పప్పు వెంకటేశ్వర్లు, సైదులు, శ్రీనివాస్‌రెడ్డి, హతీరాం పాల్గొన్నారు.
ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి